వీసా సంబంధిత వివాదంపై ఒక వినియోగదారుడికి 6 శాతం వడ్డీతో సహా రూ.70 వేలకు పైగా మొత్తాన్ని చెల్లించాలని హైదరాబాద్ (Hyderabad)జిల్లా వినియోగదారుల పరిష్కార కమీషన్ ఓ అంతర్జాతీయ టూర్ ఆపరేటర్‌ను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.ఆగస్ట్ 2022లో తన తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా యూరోపియన్ యూనియన్ టూర్ ప్యాకేజీని (European Union tour package)బుక్ చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు కమీషన్ ఈ తీర్పు వెలువడింది.
ఫిర్యాదుదారుడు తొలుత టూర్ కోసం రూ.1,00,000ను చెల్లించాడు.కానీ ప్రయాణానికి కొద్దిరోజుల ముందు అతని వీసా తిరస్కరించబడింది.
వీసా అపాయింట్‌మెంట్ (Visa appointment)సమయంలో టూర్ ఆపరేటర్ హోటల్, ఫ్లైట్ టికెట్ (hotel, flight ticket)బుకింగ్‌కు సంబంధించి అవసరమైన పత్రాలను అందించడంలో విఫలం కావడంతో వీసా తిరస్కరణకు గురైనట్లుగా కమీషన్ తన విచారణలో తేల్చింది.టూర్ ఆపరేటర్ సేవలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు పాల్పడినట్లుగా నిర్ధారించింది.
ప్రారంభంలో ఆపరేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అంగీకరించి , కొంత నగదును వాపసు చేయడానికి అంగీకరించాడు.అయితే బుకింగ్ రద్దు ఛార్జీ కింద రూ.45 వేలు కట్ చేసుకుని కేవలం రూ.10 వేలు మాత్రమే వినియోగదారుడికి చెల్లించింది.

ఫిర్యాదుదారుడు తన ప్రయాణ ఉద్దేశ్యాన్ని సమర్ధించుకోవడంలో విఫలమయ్యాడనే ఆపరేటర్ వాదనను కమీషన్ తోసిపుచ్చింది.వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించి కంపెనీ తన ఒప్పంద బాధ్యతలలో విఫలమైందని తీర్పు వెలువరించింది.సెప్టెంబర్ 29, 2022 నుంచి 6 శాతం వడ్డీతో కలిపి రూ.70 వేల వాపసు చేయడంతో పాటు మానసిక క్షోభ, ఆర్ధిక నష్టానికి పరిహారంగా రూ.30 వేలు, చట్టపరమైన ఖర్చుల కోసం మరో రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.

కాగా.పుట్టినరోజులు, పెళ్లిళ్లు, వివాహ వార్సికోత్సవం, పార్టీలు లేదా ఇతర విహార యాత్రల నిమిత్తం భారతీయులు విదేశాలకు వెళ్లడం ఇటీవల పెరిగింది.దీంతో ఈ తరహా సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సంస్థలు పుట్టుకొస్తున్నాయి.నానాటికీ భారతీయ మార్కెట్ పెరుగుతుండటంతో బడా కంపెనీల చూపు భారతీయులపై పడింది.







