ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలు మొదటినుంచి కలిగిస్తూనే ఉన్నాయి.అసలు వైసీపీ తో బిజెపి స్నేహం కోరుకుంటుందా, వైరం పెట్టుకోవాలి అనుకుంటుందా అనే విషయం ఎవరికి అర్థం కాకుండానే ఉండేది.
ఒక్కో సందర్భంలో ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తూ, మరో సందర్భంలో కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం తో ఏపీ కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నది స్నేహమా లేక శత్రుత్వమో అనేది ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.ఇది ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గంను విస్తరించబోతున్నారు.
ఈ విస్తరణ లో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో కొద్ది రోజులుగా బిజెపి పెద్దలు కసరత్తు చేస్తున్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు.
దీనిలో భాగంగానే వైసీపీ అధినేత జగన్ కు బిజెపి పెద్దల నుంచి సందేశాలు వస్తున్నాయట.
కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా బిజెపి పెద్దలు స్వయంగా జగన్ ను కోరుతుండడంతో దీనిపై ఏం చేయాలనే దానిపై జగన్ ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం చూస్తే ఏపీ ప్రభుత్వం తలకు మించిన భారమైన పథకాలను అమలు చేస్తోంది.ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు భారీగానే సొమ్ము కావాల్సిన పరిస్థితి ఉంది.
దీని కోసం తప్పనిసరిగా కేంద్రం సహకారం అవసరం.అయితే కేంద్ర కేబినెట్ లో చేరితే నిధులకు ఇబ్బందులు ఉండవు అని జగన్ అభిప్రాయపడుతున్నారట.
వైసీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు కేటాయించేందుకు బిజెపి సిద్ధంగా ఉంది.
జగన్ మరింతగా ఒత్తిడి చేస్తే మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. అంటే మూడు, నాలుగు కేంద్రమంత్రి పదవులు తీసుకుంటే వైసీపీకి ఎంతో మేలు జరుగుతుంది అనేది జగన్ అభిప్రాయమట.ఈ మంత్రి పదవులను సామాజిక వర్గాల సమతూకం పాటించాలి అనేది జగన్ అభిప్రాయంగా ఉందట.
ఒక మంత్రి పదవి విజయసాయి రెడ్డి కి వెళ్ళినా, మరో రెండు పదవుల్లో బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత కల్పించాలని చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల తిరుపతి నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ గురుమూర్తికి ఎస్సీ కోటాలో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
మిగిలిన వారు ఎవరనేది తేలాల్సి ఉంది.