నిర్లక్ష్యం. ఇదొక భయంకరమైన వ్యసనం అని చెప్పవచ్చూ.
పలకడానికి తేలికగా అనిపించినా దీని వల్ల కలిగే బాధ మాత్రం అణుబాంబు విస్పోటనం కంటే ఎక్కువగా ఉంటుంది.ఇప్పటికే ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపించే ఈ వ్యసనం వల్ల జరగకూడని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇలాంటి ఘటనే ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.
పాల్వంచ మండలం ప్రభాత్ నగర్ గ్రామ పంచాయతీలో భరత్ రెడ్డి అనే యువకుడికి ఈ నెల 2న పొలంలో పాము కాటు వేసింది.దీంతో అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారట కుటుంబసభ్యులు.
అక్కడ ఇతన్ని పరీక్షించిన డాక్టర్ పాము కాటు ఇంజక్షన్‌కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ రాశారట.అక్కడి సిబ్బంది కూడా ఈ విషయాన్ని గ్రహించక కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ వేశారట.
మళ్లీ రెండో డోసుకు 5వ తేదీ రావాలని సూచించగా ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లిన యువకునికి అసలు విషయం తెలిసిందట.కాగా ఆ యువకున్ని కరిచింది విషం ఉన్న పాము కాకపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇక ఇదే ఆస్పత్రిలో మరో వ్యక్తికి హెచ్ఐవీ లేకపోయినప్పటికి అది ఉన్నట్లుగా రిపోర్టు ఇచ్చిన ఘనత కూడా ఉందట.చూశారా ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు బాధ్యులు అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.