కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ కు ముందు షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీలో విడుదలవుతుండగా లాక్ డౌన్ కు ముందు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు మిగిలిన షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధమవుతున్నాయి.
అయితే సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలంటే దర్శకనిర్మాతలు భయపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్ల వైపు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి కనిపించడం లేదు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్ల నిర్వహణ సినిమా థియేటర్ల ఓనర్లకు అంత తేలిక కాదు.అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని క్రిస్ మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

సాధారణంగా సాయిధరమ్ తేజ్ సినిమాలకు థియేట్రికల్ హక్కుల రూపంలో 20 నుంచి 25 కోట్ల రూపాయలు వస్తాయి.అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని సమాచారం.ఈ సినిమా నిర్మాతలు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ5, జీ తెలుగుకు విక్రయించగా ఆ సంస్థ థియేటర్ రైట్స్ ను విక్రయించింది.యూవీ క్రియేషన్స్ సోలో బ్రతుకే సో బెటర్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.
మరోవైపు ఈ సినిమా అందుకునే ఫలితాన్ని, ప్రేక్షకుల రెస్పాన్స్ ను బట్టి తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలో లేక ఓటీటీలో విడుదల చేయాలో నిర్ణయం తీసుకోవాలని ఇతర సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు.ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే.
ప్రతిరోజు పండగే సినిమా తరువాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.