ఆన్ లైన్ గేమ్ పబ్జీ ఆటలో మునిగి ఓ కుర్రాడు ప్రాణాలు విడిచిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.ఆటకు బానిసైన ఆ యువకుడు భోజనం, నీళ్లు తాగడం కూడా మరిచిపోయాడు.
చివరకు ఆరోగ్య సమస్యలు తలెత్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పశ్చిమ గోదావరి జిల్లా జాజులకుంటకు చెందిన ఓ యువకుడు పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు.
ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అదేపనిగా ఆన్ లైన్ లో పబ్జీ ఆడుతూ కూర్చునే వాడు.చివరికి తిండి తినాలి, నీరు తాగాలనే విషయం కూడా మర్చిపోయాడు.
ఆట మత్తులో పడి అనారోగ్యానికి గురయ్యాడు.తల్లిదండ్రులు ఆ యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన డాక్టర్లు షాక్ కి గురయ్యారు.
తిండి తినక, నీరు తాగక యువకుడి శరీరం డీహైడ్రేషన్ కి గురైందని, దీంతో పాటు డయేరియా బారిన కూడా పడ్డాడని వెల్లడించారు.
కాగా, ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు.కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగారు.దేశవ్యాప్తంగా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ గేమ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించినప్పటికి యువతలో మార్పు రావడంలేదని, ప్రభుత్వమే కఠిన నిర్ణయాలు తీసుకుని పబ్జీ వంటి ఆన్ లైన్ గేమ్ లను నిషేధించాలని పలువురు ఆరోపిస్తున్నారు.