చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడా ఏ విషయంలోనూ వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు.ఏదో ఒకరకంగా అధికార పార్టీని ఇబ్బందులకు గురిచేసి రాజకీయంగా టీడీపీ కి మైలేజ్ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
అందులో భాగంగా ప్రభుత్వాన్నిఇరుకున పెట్టే ఏ అవకాశాన్ని కూడా బాబు వదులుకునేందుకు సిద్దపడడంలేదు.ప్రస్తుతం అధికార పార్టీని బాగా ఇబ్బందిపెడుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది ఇసుక విషయమే.
దీని మీదే అధికార పార్టీ వ్యతిరేకులంతా పోరాడుతున్నారు.కొద్ది రోజుల క్రితమే విశాఖలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు.
దీనికి టీడీపీ కూడా మద్దతు పలికింది.అయితే ఇప్పుడు సొంతంగానే ఇసుక దీక్ష చేపట్టి రాజకీయంగా మరింత పుంజుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.
ఈ మేరకు ఈ నెల 14 వ తేదీన ఇసుక సత్యాగ్రహం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఉప్పు సత్యాగ్రహం మాదిరిగా ఇసుక సత్యాగ్రహం చేపట్టాలని టీడీపీ అధినేత ఆలోచిస్తుండగా అప్పట్లో జరిగిన ఉప్పు సత్యగ్రం మాదిరిగానే వాగులు, నదుల్లో ఇసుకను తవ్వి ప్రజలకు అందించాలని, ఆ సంద్రాభంగా ప్రభుత్వం పెట్టే ఏ కేసునైనా ఎదుర్కోవాలని కొంతమంది నాయకులు అధినేతకు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఈ నెల 14వ తేదీ దీక్ష తరువాత దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.ఇసుక విషయంలో ఎవరు ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.
కాలువలు, నదులలో వరద ఎక్కువగా ఉందని, వరద తగ్గిన తరువాత ఇసుక రవాణా మొదలవుతుందని, ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పుకొస్తోంది.

అయితే ఇసుక మీద ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీక్షలు చేసిన నేపథ్యంలో బాబు దీక్ష చేపట్టడం ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ విషయం పై ఇప్పటికే వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ చంద్రబాబు ఇలా మీడియా ని అడ్డం పెట్టుకొని ఏమైనా కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, దొంగ దీక్షలను చేస్తే ప్రజలే తిప్పికొడతారని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు.
అయినా ఇసుక విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉండాలని బాబు భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 వరకు చంద్రబాబు తన దీక్ష చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి.