వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉంది తెలంగాణ కాంగ్రెస్.బీఆర్ఎస్ , బిజెపి నుంచి గట్టి పోటీ ఎదురైనా, వాటిని ఎదుర్కొని అధికారంలోకి వచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు పూర్తయ్యాయి.నియోజకవర్గల్లో పార్టీ పరిస్థితి ఏంటి ? ఎవరి బలం ఎంతుంది అనే వాటిపై సర్వేలు పూర్తయ్యాయి.ఇక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి వాటిని ప్రకటించడం ద్వారా అభ్యర్థులు జనాల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వెసులబాటు ఉంటుందని భావిస్తోంది.ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా కసరత్తు మొదలుపెట్టింది.
ఈ నెలాఖరులోగా, 80 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే ఆశావాహుల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలనకు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కూడా నియమించింది.తాజాగా ఏఐసిసి ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న నాలుగు రాష్ట్రాలకు ఈ కమిటీలను ఏర్పాటు చేసిన బిజెపి అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కోసం తమిళనాడుకు చెందిన మురళీధరన్( Muraleedharan ) ను చైర్మన్ గా స్క్రీనింగ్ కమిటీని నియమించింది.
బాబా సిద్ధిక్ జిగ్నేష్ మేవాని సభ్యులుగా ఈ కమిటీని నియమిస్తూ ఎఐసీసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే ఈ కమిటీలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా నలుగురిని నియమించారు.
వీరిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ని నియమించారు.
అలాగే వీరితో పాటు రాష్ట్ర ఇంచార్జీలుగా ఉన్న ఏఐసిసి సెక్రటరీలు కూడా ఉంటారని కాంగ్రెస్ ప్రకటించింది.ఇక వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం ఆశావాహుల నుంచి తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) స్వీకరించిన దరఖాస్తులను ముందుగా ఎన్నికల కమిటీ పరిశీలించి ఒక జాబితాను ఫైనల్ చేస్తుంది.ఆ జాబితాను ఇప్పుడు ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ మరోసారి పరిశీలించి ఏఐసిసికి పంపిస్తుంది.
స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉండబోతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.