జనసేన ‘ వారాహి ‘ గురించిన చర్చే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.నిన్ననే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహిని జనాలకు పరిచయం చేశారు.
మిలటరీ వాహనాన్ని పోలి ఉండే విధంగా తన ప్రచార వాహనాన్ని పవన్ సిద్ధం చేయించుకున్నారు.గత కొన్ని నెలలుగా ఈ వాహనం కు సంబంధించిన సమాచారం బయటకు వస్తుంది.
2024 ఎన్నికల ప్రచారాన్ని ఈ వాహనం ద్వారానే నిర్వహించేందుకు పవన్ చాలా జాగ్రత్తలు తీసుకుని దీని నిర్మాణం దగ్గరుండి చేయించారు.ఈ వాహనంలోనే సకల సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగానే పవన్ ఏపీ అంతట యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే కొత్త రధాన్ని సిద్ధం చేసుకున్నారు.
గతంలో ఎన్నికల ప్రచార సమయంలోను, జిల్లాల పర్యటనలలోను పవన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇకపై ఆ తరహా ఇబ్బందులు ఏర్పడకుండా ఈ కొత్త వాహనం సిద్ధమైంది.
ఇక దీనికి వారాహి అని పేరు పెట్టడం కూడా ఆసక్తికరంగా మారింది.వారాహి అంటే వరాహ రూపం లోని విష్ణుమూర్తిగా భక్తులు కొలుస్తారు.
రాక్షసులు సముద్రంలో దాచిన భూమిని విష్ణుమూర్తి వరాహ రూపం లో వచ్చి బయటకు తీసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.ఏపీలో జగన్ పాలనని రాక్షసి పాలనగా టిడిపి జనసేన లో పోల్చుతూ అనేక విమర్శలు చేస్తున్నాయి .ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ఆ రాక్షస పాలనను అంతం చేసేందుకు వారాహి వాహనంతో పవన్ ఎన్నికల యుద్ధంలోకి దూసుకెళ్లబోతున్నట్టు గా జన సైనికులు చెబుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా… అసలు ఈ ‘ వారాహి ‘ ఖర్చు ఎవరు పెట్టుకున్నారు అనే విషయంలో అనేక అనుమానాలు మొదలయ్యాయి.పవన్ తన సొంత సొమ్మును వెచ్చించి ఈ వాహనాన్ని తయారు చేయించుకున్నారని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా చెబుతుండగా , జనసేన ప్రత్యర్థులు మాత్రం ఇదంతా ఓ ప్రముఖ నిర్మాత వారాహి చిత్ర నిర్మాణ సంస్థ అధినేత సాయి కొర్రపాటి చేయించారని, సినీ హీరో బాలకృష్ణకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో సాయి కొర్రపాటి కూడా ఒకరిని, అలాగే పవన్ తో కూడా అంతే స్థాయిలో ఆయనకు సాన్నిహిత్యం ఉందని , అలాగే ఆయన టిడిపి సానుభూతిపరుడని, అమరావతి రాజధాని నిర్మాణం కోసం గత టిడిపి ప్రభుత్వ హయాంలో 25 లక్షల రూపాయలను ఆయన విరాళంగా అందించారని, ఇప్పుడు ఆయనే ఈ ‘వారాహి ‘ ఖర్చునంత భరించారని, ఆయనే దీనికి ఆ నామకరణం చేశారనే ప్రచారం జనసేన ప్రత్యర్థులు చేస్తున్నారు.ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది క్లారిటీ లేనప్పటికీ, పవన్ ‘వారాహి ‘ వెనుక టిడిపి ఉందనే అభిప్రాయం మాత్రం జనాల్లోకి వెళ్తేనే అసలు తలనొప్పి మొదలవుతుంది అనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.