అమెరికాకు భారత్ నుంచీ వలసలు వెళ్ళే రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలదే కీలక స్థానం.తెలుగు రాష్ట్రాల నుంచీ ఎంతో మంది తెలుగువారు అమెరికాకు వెళ్తూ ఉంటారు.
భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచీ అమెరికాలోని పలు రాష్ట్రాలకు వివిధ కారణాల రీత్యా వలసలు వెళ్ళిన తెలుగువారు అందరూ కమ్యూనిటీ గా ఏర్పడి అక్కడ పలు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు.అలా ఏర్పాటు చేసుకున్న తెలుగు సంఘాలలో ఒకటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ( టాంటెక్స్ )
తెలుగు భాషాభివృద్దిని, తెలుగు సాంప్రదాయాలను ఎన్నారైల పిల్లలకు అందించడంలో, తెలుగు పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించడంలో టాంటెక్స్ ఎప్పుడూ ముందుంటుంది.
అలాగే అమెరికాలో ఇబ్బందులు పడుతూ పలు సమస్యలు ఎదుర్కుంటున్న తెలుగు వారు ఎవరైనా ఉంటే వారికి అండగా నిలబడుతుంది.అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టే టాంటెక్స్ అమెరికాలో పలు రకాల సమస్యలలో ఉన్న తెలుగు వారికి అండగా ఉంటూ బాధితులు ఉండేందుకు వసతి కల్పిస్తున్న డల్లాస్ లోని స్థానిక ది ఫ్యామిలీ ప్లేస్ ట్రస్ట్ ను సందర్శించింది.
గృహ హింసా బాధితులు, అనారోగ్యం బాగోక, ఇబ్బందుల్లో ఉన్న వారు, గృహ హింసకు గురై మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు వారికి వసతి కల్పించి వారి జీవితాలకు భరోసా ఇచ్చి అండగా నిలబడుతున్న సదరు సంస్థ సేవలను టాంటెక్స్ కొనియాడింది.తెలుగు వారికి సేవలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ క్రమంలోనే సంస్థకు ఆర్ధికంగా సాయం చేయదలిచి విరాళాల ద్వారా సేకరించిన 1205 డాలర్లను సదరు సంస్థకు అందించింది.భవిష్యత్తులో కూడా తమ టాంటెక్స్ తరుపున తమ సహాయ సహకారాలు అందుతాయని టాంటెక్స్ అధ్యక్షులు అన్నపూర్ణ తెలిపారు.