ముందుగా ఊహించినట్లే ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉద్రిక్తంగా మారింది.ఆయన పర్యటనను అడ్డుకుంటామని మొదటి నుంచీ చెబుతూ వచ్చిన వైసీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సులపై ఏకంగా రాళ్లు, చెప్పులు విసిరారు.
దీంతో బస్సు అద్దం పగిలింది.
ఇక కొందరు నల్లజెండాలతో నిరసన తెలిపారు.తన పర్యటనలో భాగంగా అమరావతిలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత నిలిచిపోయిన నిర్మాణాలన్నింటినీ బాబు పరిశీలించారు.
ఆయన వెంట రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా ఉన్నారు.మొదట తన ఇంటి నుంచి చంద్రబాబు ప్రజావేదిక దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు.
జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రజావేదిక అక్రమ నిర్మాణమంటూ కూల్చేసిన సంగతి తెలిసిందే.అక్కడి నుంచి అమరావతి కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లారు.శంకుస్థాపన సందర్భంగా ఇక్కడే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టిని వేసిన సంగతి తెలిసిందే.ఆ మట్టికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం.
అమరావతిని మరో హైదరాబాద్‌లా మారుద్దామని అనుకున్నా.వైసీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని, దీనిని శ్మశానంతో పోల్చడం చాలా బాధ కలిగించిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.జగన్ సర్కార్ అమరావతిని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.