గతేడాది జూలైలో కార్‌జాకింగ్‌కు (వాహనాన్ని అపహరించడం) ప్రయత్నిస్తూ ఇండో కెనడియన్ ఫుడ్ డెలివరీ డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో కెనడా పోలీసులు బ్రాంప్టన్‌లో నివసిస్తున్న 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మేరకు పీల్ రీజినల్ పోలీసులు (పీఆర్‌పీ) ఓ ప్రకటన విడుదల చేశారు.
అరెస్ట్ చేసిన వ్యక్తిని జాజైన్ కెర్( Jazaine Kerr )గా గుర్తించారు.ఈ కేసుకు సంబంధించి గతేడాది నవంబర్‌లో గుర్తుతెలియని మైనర్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్ట్ అయిన రెండో వ్యక్తి ఇతనే.
పంజాబ్( Punjab )లోని నవన్‌షహర్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల గుర్విందర్ నాథ్( Gurvinder Nath ) అనే విద్యార్ధి సొంత వ్యాపారం ప్రారంభించాలనే లక్ష్యంతో 2021 జూలైలో కెనడా వెళ్లాడు.ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో భాగస్వామిగా చేరాడు.ఈ క్రమంలో జూలై 9న తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో డెలివరీ కోసం క్రెడిట్ వ్యూ రోడ్డులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని దుండగులు గుర్విందర్‌ను అడ్డుకున్నారు.అనంతరం అతనిపై దాడి చేసి వాహనాన్ని దొంగిలించుకుపోయారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గుర్విందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 14న తుదిశ్వాస విడిచాడు.అతను టొరంటోలోని లాయలిస్ట్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుంటున్నాడు.
ఈ కేసుకు సంబంధించి పీల్ రీజినల్ పోలీసులు గురువారం నిందితుడి బ్రాంప్టన్ నివాసంలో సెర్చ్ వారెంట్‌ను అమలు చేశారు.సెకండ్ డిగ్రీ హత్య, అనధికారికంగా తుపాకీని కలిగి వుండటం, తుపాకీని నిల్వ చేయడం వంటి అభియోగాలను జాజైన్ కెర్‌పై మోపారు.అయితే ఈ కేసులో ఇంకా ఎవరైనా అనుమానితులు వున్నారా అనే విషయాన్ని పీఆర్పీ స్పష్టం చేయలేదు.
గుర్విందర్ మరణం అప్పట్లో ఇండో కెనడియన్ కమ్యూనిటీని ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇక్కడ చదువుకునే అంతర్జాతీయ విద్యార్ధులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ.తరచూ ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.నాథ్ హత్యకు సంతాపంగా స్థానికులు శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనని నిర్వహించారు.