ఈరోజుల్లో చాలా కంపెనీలు ఉద్యోగుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి.వారు తుమ్మినా తప్పే అంటున్నాయి, వారు దగ్గినా నిందిస్తున్నాయి.
కొద్ది నెలల క్రితం స్పోర్ట్స్ షూస్ (Trainers) వేసుకున్నందుకు ఓ యువతిని ఉద్యోగం నుంచి తొలగించి పెద్ద షాక్ ఇచ్చింది ఓ కంపెనీ.ఇరవై ఏళ్ల ఎలిజబెత్ బెనాస్సీ ( Elizabeth Benassi )అనే యువతి తన ఆఫీస్‌కు స్పోర్ట్స్ షూస్ వేసుకొని వచ్చింది.
అంతే ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు.ఇది అన్యాయం అంటూ ఆమె కోర్టుకెక్కింది.కట్ చేస్తే ఈ ఉద్యోగినికి ఏకంగా 30,000 పౌండ్లు (మన కరెన్సీలో సుమారు రూ.32 లక్షలు) పరిహారంగా దక్కాయి.
వివరాల్లోకి వెళితే మాక్సిమస్ యూకే సర్వీసెస్‌లో( Maximus UK Services ) 2022లో 18 ఏళ్ల వయసులో ఎలిజబెత్ ఉద్యోగంలో చేరింది.అక్కడ డ్రెస్ కోడ్ ఉందని తనకు తెలియదని ఆమె చెప్పడంతో అసలు కథ మొదలైంది.
మిగతా ఉద్యోగులు కూడా అలాంటి షూస్ వేసుకున్నా వారిని ఏమీ అనలేదని, తనను మాత్రమే టార్గెట్ చేశారని ఆమె ఆరోపించింది.కేవలం మూడు నెలలు పనిచేసిన తర్వాత ఆమెను ఉద్యోగం నుండి తీసేశారు.
లండన్‌లోని క్రోయ్‌డాన్‌లో( Croydon, London ) జరిగిన విచారణలో ఎలిజబెత్ తన బాధను వెళ్లగక్కింది.ఒక మేనేజర్ తన స్పోర్ట్స్ షూస్‌ను విమర్శించి, తనను చిన్నపిల్లలా చూశారని ఆమె వాపోయింది.విచారణలో కంపెనీ ఆమెను అన్యాయంగా టార్గెట్ చేసిందని, కావాలనే తప్పు పట్టాలని చూసిందని తేలింది.
అంతేకాదు, ఆమె చిన్న వయస్సు కావడంతో ఆమెను అతిగా నియంత్రించారని (మైక్రోమేనేజ్‌మెంట్) కూడా నిర్ధారించారు.మాక్సిమస్ యూకే సర్వీసెస్, డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్‌కు సేవలు అందిస్తుంది.
మాక్సిమస్ యూకే సర్వీసెస్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.కానీ, న్యాయస్థానం ఎలిజబెత్‌కు మద్దతుగా తీర్పునిచ్చింది.బాధింపజేసినందుకు గాను £29,187 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి డ్రెస్ కోడ్ గురించి తెలియకపోవచ్చు అనే విషయాన్ని కంపెనీ పరిగణనలోకి తీసుకోలేదని జడ్జి ఫోర్వెల్ అన్నారు.ఇది స్పష్టమైన అన్యాయమని, తప్పు పట్టాలనే ఉద్దేశాన్ని చూపిస్తుందని ఆయన గట్టిగా చెప్పారు.
ఈ కేసు యువ ఉద్యోగుల హక్కులకు ఒక మైలురాయిగా నిలుస్తుంది.