కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన రంగం విమానయానం.ఫస్ట్‌వేవ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుని పలు దేశాలు టూరిస్ట్‌లకు స్వాగతం పలికాయి.
కానీ సెకండ్ వేవ్ వాటికి బ్రేక్ వేసింది.భారత్‌తో సహా పలు దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను దాదాపు అన్ని దేశాలు నిలిపివేశాయి.
అయితే మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్క దేశం ఆంక్షలను ఎత్తివేస్తూ వస్తోంది.డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు పలు దేశాలు ప్రకటించాయి.
డిసెంబర్ చివరి నాటికి ప్రపంచం మొత్తం సాధారణ పరిస్ధితులు నెలకొంటాయని అందరూ భావించారు.
కానీ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ అందరి ఆశలపై నీళ్లు చల్లింది.
అమెరికా, ఆస్ట్రేలియా సహా 20కి పైగా దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కట్టుదిట్టంగా స్క్రీనింగ్ చేస్తున్నాయి.అంతేకాదు క్వారంటైన్‌లో ఉండాలని కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చాయి.భారత్ విషయానికి వస్తే.
సెకండ్ వేవ్ నేపథ్యంలో మనదేశం నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం పలు దేశాలకు వెళ్లాల్సిన భారతీయులు స్వదేశంలోనే నిలిచిపోయారు.
అయితే పరిస్దితులు చక్కబడిన నేపథ్యంలో డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్దరిస్తామని ప్రకటించింది.కానీ ఈలోపు కొత్త వేరియంట్ కారణంగా భారత ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధిస్తున్నట్లు జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది.తొలుత జనవరి 31 వరకు నిషేధం వుండగా.ఇప్పుడు ఆ నిషేధాన్ని మరో నెల రోజులు పొడిగించింది.అయితే దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో భారత్ అంతర్జాతీయ సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించింది.మార్చి 15 నుంచి ఇవి మొదలయ్యే అవకాశాలున్నాయని కేంద్ర పౌర విమానయాన వర్గాలు చెబుతున్నాయి.అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
కోవిడ్ వల్ల తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ విమానయానం పుంజుకుంటోందని.రోజువారీ ప్రయాణికుల సంఖ్య వచ్చే రెండు నెలల్లో గతంలో మాదిరిగా చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు
.