అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) హత్యాయత్నం జరిగింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో గుర్తుతెలియని దుండగుడు ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డాడు.
దుండగుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపగా.ట్రంప్ చెవికి గాయమైంది.
స్టేజ్‌పై ట్రంప్ మాట్లాడుతుండగా.దుండగుడు కాల్పులు జరిపాడు.
దీంతో ఆయన పోడియం కింద దాక్కొని తనను తాను రక్షించుకున్నారు.ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని ట్రంప్‌కు రక్షణ కవచంలా నిలిచారు.
అనంతరం ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ట్రంప్ పరిస్ధితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.
అప్పటికే ఈ కార్యక్రమాన్ని మీడియా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో కాల్పుల ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడంతో ప్రపంచం ఉలిక్కిపడింది.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,( Joe Biden ) ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు( Kamala Harris ) ఈ ఘటనను ఖండించారు.ఘటనకు సంబంధించిన వివరాలను బైడెన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ట్రంప్ త్వరగా కోలుకోవాలని కమలా హారిస్ ఆకాంక్షించారు.వేగంగా స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ , ఇతర భద్రతా ఏజెన్సీలను ఆమె అభినందించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) సైతం ఘటనను ఖండించారు.తన స్నేహితుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.గాయపడిన వారు కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.

ఇక .ఈ ఘటనపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ పెట్టారు.కాల్పుల ఘటనపై వేగంగా స్పందించిన సీక్రెట్ సర్వీస్, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ ఘటనలో మరణించిన వ్యక్తికి, గాయపడిన మరో వ్యక్తి కుటుంబానికి ట్రంప్ సానుభూతి తెలిపారు.
తన కుడి చెవి పై భాగం మీదుగా బుల్లెట్ దూసుకెళ్లిందన్నారు.ఈ ఘటనపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.