భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిర పడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కన బెట్టి.
కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.
కాగా.గత నెలతో పాటు గడిచిన వారం రోజుల్లో వరుసగా హిందూ దేవాలయాల్లో చోరీలు జరగడంతో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని హిందూ సమాజం భయాందోళనలకు గురవుతోంది.
హిందూ ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ చోరీలు, విధ్వంసక చర్యల దర్యాప్తులో పురోగతి లేక పోవడంతో హిందూ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బ్రాంప్టన్‌లోని భారత మాతా మందిర్‌లో గత గురువారం రాత్రి దుండగులు చోరీకి తెగబడ్డారు.
విరాళాల బాక్స్‌ని పగులగొట్టి నగదుతో ఊడాయించారు.దీనిపై ఆలయ పూజారి కేశబ్ కొయిరాల మాట్లాడుతూ.
హిందూ దేవాలయాలు ఒక్కొక్కటిగా టార్గెట్ అవుతున్నాయన్నారు.ఈ ఘటనలు తమలో భయాన్ని వ్యాపింపజేసే చర్యలు కావొచ్చని కొయిరాల ఆరోపించారు.
వీటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి వుందని ఆయన డిమాండ్ చేశారు.
మిస్సిసాగాలోని రామమందిరం వద్ద కూడా దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు.అయితే సెక్యూరిటీ అలారం మోగడంతో దుండుగులు పారిపోయారు.ఈ రెండు ఘటనలు జనవరి నెలలో జరిగిన 6 దొంగతనాలకు దగ్గరగా వుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పీల్ , హామిల్టన్ పోలీసులు చోరీల కేసులను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.జనవరి 15న బ్రాంప్టన్‌లోని శ్రీహనుమాన్ మందిరంలో చోరీకి విఫలయత్నం చేయగా.అదే నెల 25న బ్రాంప్టన్‌లోనే చింత్‌పూర్ణి మందిర్, గౌరీ శంకర్ మందిర్, జగన్నాథ దేవాలయం, హిందూ హెరిటేజ్ సెంటర్, హామిల్టన్‌లోని సమాజ్ ఆలయంలో ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
వరుస ఘటనలపై కెనడియన్ హిందూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ కుషాగర్ శర్మ స్పందించారు.
దేశ చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో అనేక హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి అన్నారు.అసలు దేవాలయాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని.
దీనికి తోడు పోలీసులు కూడా నేరస్తులను పట్టుకోకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కుషాగర్ ఆవేదన వ్యక్తం చేశారు.