ఖమ్మం జిల్లా కల్లూరు లోని సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలను జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రాంగణమంతా కలియతిరుగుతూ విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు.
డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ గదులను తనిఖీ చేశారు.వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల సరఫరా, కూరగాయలు, కిరాణా సరకుల సరఫరా విషయమై అడిగి తెలుసుకున్నారు.
స్టోర్ గదిలో పప్పు, కూరగాయలు,ఇతర వస్తువులను కలెక్టర్ పరిశీలించారు.ఆవరణలో కూరగాయల పెంపకం గురించి అడిగి, స్థలం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మెనూ విషయమై అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినులతో మమేకమై వారితో సంభాషిస్తూ, మధ్యాహ్న భోజనం చేశారు.
వసతులు, ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు.భోజనం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
పాఠశాల విద్యార్థినులకు, కళాశాల విద్యార్థినులకు వేరు వేరు సమయాల్లో భోజనం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.
అనంతరం రెసిడెన్షియల్ కళాశాలకు వెళ్లి లెక్చరర్ గా విద్యార్థినులకు క్లాస్ తీసుకున్నారు.ఇంటర్ సిఇసి విద్యార్థినులకు డిమాండ్ స్థితిస్థాపకత గురించి వివరించారు.
ఒక్కో విద్యార్థిని తన లక్ష్యం ఏమిటి అని అడిగి, అ లక్ష్య సాధనకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలో ఉద్భోదించారు.ప్రతి విద్యార్థినికి కెరీర్ మార్గదర్శనం కల్పించాలన్నారు.
ఈ దిశగా ప్రత్యెక చర్యలు చేపట్టాలన్నారు.కలెక్టర్ తనిఖీ సందర్భంలో కల్లూరు ఆర్డివో సూర్యనారాయణ, తహసిల్దార్ బాబ్జి ప్రసాద్, అధికారులు, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు వున్నారు.