తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఏదైతే జరగకూడదని అనుకున్నారో, జరగబోదని భావించారో అదే జరిగింది.నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఏసీబీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేర్చింది.
ఏసీబీ తయారుచేసిన ఛార్జిషీటులో చంద్రబాబు పేరు ఉంది.ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మల్యే స్టీఫెన్‌సన్‌ను కలిసినప్పుడు ‘బాస్’ పంపితే వచ్చానని అన్నారు.‘బాస్’ అనే పదాన్ని రేవంత్ పదే పదే ఉచ్చరించారు.ఒక జాతీయ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం మూండొందల పందొమ్మిది డాక్యుమెంట్లను జత చేసి ఇరవైఐదు పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది.
ముప్పయ్ తొమ్మదిమంది సాక్షుల వాంగ్మూలాలు జత చేసింది.ఛార్జిషీటులో చంద్రబాబు పేరు చేర్చడం ఈ కేసులో కీలక మలుపు.ఆయనకు ఇక సమన్లు పంపుతారు.చంద్రబాబు నాయుడు ఫోన్ సంభాషణల (స్టీఫెన్‌సన్‌తో) ఆడియో టేపులు ఫోరెన్సిక్ లాబ్‌లో పరీక్ష చేయగా, అది ఆయన కంఠమేనని నిర్థారణ అయిందని తెలిసింది.
నోటుకు ఓటు కేసులో ఇప్పటి వరకు నడిచింది ఒక ఎత్తయితే, ఇక నుంచి జగిగేది మరో ఎత్తు.నోటుకు ఓటు కేసుకు ప్రతిగా చంద్రబాబు లేవనెత్తిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాన్ని ఆయన ఎలా నడిపిస్తారో చూడాలి.
ఆధారాలు బయటపెడతామన్నారు.కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
ఇంకా చాలా చాలా చెప్పారు.ఇక కథ రంజుగా ఉండే అవకాశం ఉంది.