సాధారణంగా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్లో దెయ్యం ఉంటుందని గ్రామస్తులు పుకారు పుట్టించడం మనం విన్నాం.కానీ వరంగల్లోని శంభునిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో నిజంగానే దెయ్యం ఉందని, అందుకే ఆ స్కూలుకు విద్యార్ధులు రావడం లేదని ఆ గ్రామస్తులను నమ్మించింది ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.
ప్రభుత్వ పాఠశాలలో దెయ్యం ఉండటం వలనే తన ఆరోగ్యం కూడా బాగుండటం లేదని ఆమె చెప్పుకొచ్చింది.దీంతో పాఠశాల ప్రాంగణంలో ఆమె క్షుద్రపూజలు చేయించింది.ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.గత 4 రోజులుగా ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు రావడం లేదని, శుక్రవారం కారులో భూతవైద్యుడిని తీసుకువచ్చి క్షుద్రపూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు గుర్తించారు.
ఈ విషయంపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్షుద్రపూజలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.పాఠశాలలోని ఉపాధ్యాయులను ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.