ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి ఏ క్లారిటీకి రాలేకపోతోంది.పేరుకు జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్న ఆ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుని సీట్ల పంపటానికి సిద్ధమైంది వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయని, ఇప్పటికే ప్రకటించారు.
అయితే బిజెపి( BJP )ని కూడా తమ తో కలుపుకు వెళ్లాలని పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక టిడిపి అధినేత చంద్రబాబు సైతం బిజెపి తమతో కలిసి వస్తే తమకు తిరుగే ఉండదని, వైసీపీని అధికారానికి దూరం చేయాలనే తమ కోరిక తీరుతుంది అనే ఆలోచనతో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపిని పొత్తుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ వ్యవహారాలపై పరోక్షంగా బిజెపి కీలక నేత సత్య కుమార్( Satya Kumar ) స్పందించారు.

పొత్తుల విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకుంటుంది అని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి అనుగుణంగా రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలు పనిచేస్తారని ఆయన అన్నారు.పొత్తుల గురించి తాము స్పందించడం కాదని, పొత్తులు కోరుకునే నాయకులు కూడా స్పందించాలని పరోక్షంగా టిడిపి పై సెటైర్లు వేశారు.ఎవరైతే పొత్తులు ఉంటాయని అనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్లి మా కేంద్ర నాయకులతో పొత్తుల పై చర్చించాలని సత్యకుమార్ సూచించారు.రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని, పొత్తులపై అవతల నుంచి కూడా స్పందన రావాలి కదా అని ఆయన ప్రశ్నించారు.
వాస్తవానికి ఒంటరిగానే బిజెపి ఏపీలో పోటీ చేయాలని అనుకున్నామనే విషయాన్ని కూడా బయటపెట్టారు.

పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తామని ఇప్పటికీ చెబుతున్నామని సత్య కుమార్ అన్నారు.కానీ తాము ఎవరితో కలవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారో ఆ పార్టీ నుంచి కూడా స్పందన రావాలి కదా అని ప్రశ్నించారు.పొత్తుల విషయాన్ని బిజెపి పెద్దల దృష్టికి పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )తీసుకువెళ్లిన మాట వాస్తవమేనని, కానీ తమతో కలవాలనుకునే పార్టీతో ఆ విషయాన్ని చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉందని అన్నారు.
సత్య కుమార్ వ్యాఖ్యలను బట్టి చూస్తే బిజెపితో పొత్తు పెట్టుకోవాలని టిడిపి భావిస్తున్నా, కేంద్ర పెద్దలను ఈ విషయంపై కలిసి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు పంపితే ప్రయోజనం ఏంటి అనే కోణంలో సత్య కుమార్ వ్యాఖ్యలు ఉన్నాయి.