అమెరికాలో ఒమెక్రాన్ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి.రోజు రోజుకు లెక్కకు మించిన కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, కరోనా నియంత్రణ కమిటీ సభ్యుడు అయిన ఆంటోని ఫౌసీ అమెరికన్స్ ను తీవ్రంగా హెచ్చరించారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కరోనా మొదటి వేవ్ లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోనా తీవ్రతపై ఫౌసీ ముందస్తుగానే అమెరికన్స్ ను, అధ్యక్షుడిని అప్రమత్తం చేసినా ఎవరూ పట్టించుకోని కారణంగా ఆ ప్రభావం ఇప్పటికీ అమెరికాపై చూపిస్తోంది.
అలాగే
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఫౌసీ చేసిన సూచనలు అమెరికన్స్ పాటించడంతో దాదాపు అతి పెద్ద ప్రమాదం నుంచే బయటపడింది అమెరికా.ఇలా ఎప్పటికప్పుడు కరోనా వేరియంట్స్ తీవ్రతపై అలెర్ట్ చేస్తూ అమెరికన్స్ కు సూచనలు చేస్తున్న ఫౌసీ ఒమెక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో మరో సారి అమెరికన్స్ కు కీలక సూచనలు చేశారు.
ఒమెక్రాన్ అత్యంత వేగంగా ప్రపంచంపై దాడి చేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఇలాంటి ప్రమాదకరమైన సమయాలలో కూడా ప్రయాణాలు చేయడం మంచిది కాదని, గతంలో ఇలా చేయడం వలెనే ఎంతో మంది మృత్యు వాత పడ్డారని అన్నారు.రెండు వ్యాక్సిన్ లు తీసుకున్న వారిపై కూడా తాజా వేరియంట్ ప్రభావం చూపుతోందని, అయితే ప్రాణాల మీదకు వచ్చే ముప్పులేదు కానీ తప్పనిసరిగా రెండు వ్యాక్సిన్ లు వేసుకున్న వారు బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని సూచించారు. ఒమెక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయమని అలా అని అశ్రద్ద వహిస్తే ముప్పు తప్పదని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, బయటకి వచ్చే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.