వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటివరకు పార్టీ గీత దాటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, సొంత పార్టీ పైన , ప్రభుత్వం పైన , నాయకుల పైన విమర్శలు చేస్తున్న వారి విషయంలో చూసి చూడనట్లుగానే వ్యవహరించారు.
అయితే ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా వరుస వరుసగా వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగకుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంపై జగన్ సీరియస్ గానే ఉన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ దాటి వ్యవహరించిన వారి విషయంలో సానుకూలంగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు.
రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసిపి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న జగన్ , ఈ మేరకు పార్టీలోని గ్రూపు రాజకీయాల పైన, అసంతృప్త నేతలపైన సీరియస్ గా దృష్టి పెట్టారు.
ఇప్పటికే తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి పై వేటు వేశారు.
ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.ఈ ప్రభుత్వం లో ఒక్క చిన్న పని కూడా కావడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు .అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయ ల పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం 20 కోట్ల రూపాయలను మంజూరు చేసినా, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని కారణంతో రామనారాయణ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం ఇదేవిధంగా తన అసంతృప్తిని వెళ్ళగకుతూ వస్తూ ఉండడంతో, ఆయనను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించి మరీ జగన్ క్లాస్ పీకారు.అభివృద్ధి పనుల విషయంలో తాము ఎన్ని కోట్లు అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విధంగా మరోసారి బహిరంగ విమర్శలు చేస్తే ఉపేక్షించబోమంటూ జగన్ గట్టిగానే క్లాస్ పీకారు.ఇక బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు.
చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ ను పక్కనపెట్టి ఆ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు జగన్ అప్పగించారు.ఇలా వరుస వరుసగా జగన్ సీరియస్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో, చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పరోక్షంగా పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిసి వివరణ ఇచ్చుకున్నారు.ఇక ఆ తర్వాత నుంచి ఆమె సైతం బాగా యాక్టివ్ అయ్యారు.తాను వైసీపీలోనే ఉంటానని , లేదా ఇంట్లో కూర్చుంటాను తప్ప, వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ సూచరిత వ్యాఖ్యానించారు.
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో అసంతృప్త నాయకులంతా సెట్ అవుతున్నట్టే కనిపిస్తున్నారు.