బంగాళదుంప.( Potato ) దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ విరివిగా ఉపయోగించే కూరగాయల్లో ఒకటి.
అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు బంగాళదుంపను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.కర్రీస్ మాత్రమే కాకుండా బంగాళదుంపతో స్నాక్స్ కూడా తయారు చేస్తుంటారు.
అయితే బంగాళదుంప తింటే బరువు పెరుగుతారని( Weight Gain ) చాలా మంది నమ్ముతారు.ఈ క్రమంలోనే బంగాళదుంపను పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు.
కానీ బంగాళదుంప తింటే వెయిట్ గెయిన్ అవుతారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి బంగాళదుంపను వండుకునే ప్రక్రియ మరియు తినే విధానంపై బరువు పెరగడం అనేది ఆధారపడి ఉంటుంది.
వెన్న, వనస్పతి, క్రీమ్ లేదా నూనెతో వండిన బంగాళదుంపల్లో ఎక్కువ కేలరీలు ఉంటాయి.ఇవి బరువు పెరగడానికి దోహదపడతాయి.అలాగే కొందరు బంగాళదుంపలను అధిక మొత్తంలో తీసుకుంటారు.ఇది కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక కారణం.
బంగాళదుంపలను ఆరోగ్యమైన మార్గాల్లో వండుకొని మితంగా తింటే బరువు పెరుగుతారన్న భయమే అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.

పైగా బంగాళదుంపలు కడుపుకు సంతృప్తికరంగా ఉంటాయి.ఆకలి బాధలు మరియు ఆహార కోరికలను అరికట్టడంలో సహాయపడతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
అలాగే బంగాళదుంపల్లో విటమిన్ సి( Vitamin C ) మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి సెల్ డ్యామేజ్ మరియు క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు హృదయనాళ పని తీరును ప్రోత్సహిస్తాయి.

బంగాళదుంపల్లో ఫైబర్ గట్ ఆరోగ్యానికి( Gut Health ) తోడ్పడుతుంది.అంతేకాకుండా బంగాళదుంపలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.బంగాళదుంపల్లో విటమిన్ బి6 ఉంటుంది, ఇది ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్లు మెదడు పని తీరుకు మద్దతు ఇస్తాయి.కాబట్టి, బరువు పెరిగిపోతామనే అపోహలో బంగాళదంపను దూరం పెట్టారో పైన చెప్పుకున్న ప్రయోజనాలను మీరు కోల్పోయినట్లే అవుతుంది.