ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం సృష్టిస్తుంది.ఈ మేరకు పాయిజన్ తీసుకున్న ప్రేమజంటలో ప్రేమికురాలు మృతి చెందగా యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.మరిపాలెం గ్రీన్ గార్డెన్స్ ప్రాంతానికి చెందిన పాలతాటి నేహ (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
కంచరపాలెం ఏ ఎస్ ఎస్ ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణ (19), నేహ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.గతంలో నేహను తీసుకొని కృష్ణ బయటకు వెళ్లడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు ఇద్దరిని స్టేషన్‌కు రప్పించి, నేహ బాలిక కాబట్టి కిడ్నాప్ కేసు పెడతామని మందలించి అతనిని వదిలి వేశారు.
ఇదిలా ఉండగా మరల కృష్ణ సోమవారం ఉదయం నేహను తీసుకొని వెళ్లిపోయాడు.ఇంటి నుండి బయటకు వెళ్లిన కుమార్తె సాయంత్రం అయిన ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి నూకరాజు ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కిడ్నాప్, మిస్సింగ్ కేసు కృష్ణపై నమోదు చేశారు.ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం కంచరపాలెం రైతు బజార్ ఎదురుగా గల ఇందిరా నగర్ లో కృష్ణ తండ్రి వద్ద పనిచేసే ఈశ్వరరావు ఇంట్లో వీరిద్దరూ తలదాచుకున్నారు.
అప్పటికే వీరిద్దరూ పాయిజన్ తీసుకోగా నేహ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.దీంతో కృష్ణ ఈ విషయాన్ని బాలిక పిన్ని రోహిణికి చెప్పడంతో వెంటనే నేహ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆమెను కేజీహెచ్‌కు తరలించారు.
అప్పటికే నేహ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కే జి హెచ్ మార్చురీకి తరలించారు.
నేహను కేజీహెచ్‌కు తీసుకొని వచ్చినప్పుడు ప్రియుడు కృష్ణ నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చాడని, నిజంగా అతను పాయిజన్ తీసుకుని ఉంటే ఎలా నడవగలడని బంధువులు మండిపడుతున్నారు.అమ్మాయితో పురుగుల మందు తాగించి చనిపోయేలా చేశాడని అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రియుడు బాగనే ఉన్నాడని వారంటున్నారు.అయితే అమ్మాయి చనిపోయిందని వైద్యులు చెప్పగానే కళ్ళు తిరిగి కృష్ణ పడిపోవడంతో కేజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
-గతంలో కృష్ణపై కేసు… ఇదిలా ఉండగా ప్రియుడి కృష్ణపై హత్యాయత్నం కేసు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో దర్యాప్తులో ఉంది.మద్యం మత్తులో కృష్ణ ఒకరి పై దాడి చేయడంతో గాయాల పైన బాధితుడు కంచరపాలెం పోలీసులను అప్పట్లో ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో అతనిపై హత్యాయత్నం కేసు నమోదయింది.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.