ప్రస్తుత రోజుల్లో సాయం చేసిన వ్యక్తి పక్కనే ఉన్నా సరే అతడెవరో తెలియదన్నట్టుగా మొఖం పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయే ప్రభుద్దులు ఎంతో మంది ఉన్నారు.అతడు చేసింది చిన్న సాయమా లేదా పెద్ద సాయమా అనేది అనవసరం సాయం చేశాడా లేదా అనేదే ముఖ్యం.
పెద్ద పెద్ద సాయాలు చేసిన వారినే గుర్తు పెట్టుకోని ఈ కాలంలో ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం తనకు బీచ్ లో పల్లీలు ఉచితంగా ఇచ్చిన ఓ వ్యాపారి ని గుర్తు పెట్టుకుని, వెతికి పట్టుకుని మరీ అతడి ఋణం తీర్చుకోవడం, అది కూడా అమెరికా నుంచి వచ్చి మరీ తన ప్రేమను చాటడం, మామూలు విషయమా చెప్పండి.ఇలాంటి సంఘటనే కాకినాడలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.
కాకినాడకు చెందిన ప్రణవ్ అనే వ్యక్తి అమెరికా నుంచి సొంత ఊరు వచ్చారు.
వచ్చీ రాగానే బీచ్ దగ్గర పల్లీలు అమ్మే సత్తయ్య అనే వ్యక్తి కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు.ఎవరికి ఏమీ అర్ధం కాలేదు, వచ్చిన ప్రతీ సారీ అతడి గురించి వెతకడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతోంది.
ఈ నేపధ్యంలో ఈ సారి ఎలాగైనా అతడిని వెతికి పట్టుకోవాలని స్థానిక MLA వద్దకు వెళ్లి సత్తయ్యను వెతికి పట్టుకునేందుకు సహకరించాలని కోరాడు.దాంతో సదరు ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు సత్తయ్య ఇల్లు కనిపెట్టాడు.
కానీ సత్తియ్య రెండేళ్ళ క్రితమే మరణించడంతో నిరాశ చెందిన ఎన్నారై ప్రణవ్ ఆయన కుటుంబానికి 25 వేలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు.ఇంతకీ ప్రవణ్ ఎందుకు ఇదంతా చేశాడు…
సరిగ్గా 12 ఏళ్ళ క్రితం అంటే 2010 లో ప్రణవ్ తన తల్లి తండ్రులతో అమెరికా నుంచి ఇండియా వచ్చాడు.తన స్వగ్రామమైన కాకినాడలో బీచ్ కు ఆయన తండ్రితో కలిసి వెళ్ళాడు.అయితే అక్కడ పల్లీలు చూసిన ప్రణవ్ అవి కావాలంటూ తండ్రికి చెప్పడంతో పల్లీలు అమ్ముతున్న సత్తయ్య వద్దకు వెళ్లి తీసుకున్నారు.
అయితే ఆ సమయంలో ప్రణవ్ తండ్రి పరుసు తెచ్చుకోక పోవడంతో పల్లీలు వద్దని చెప్పినా సత్తయ్య పరవాలేదు బాబు ఇష్టపడ్డారు కదా తీసుకోండి డబ్బులు వద్దని చెప్పి ప్రవణ్ కు ఉచితంగా పల్లీలు ఇచ్చారట.దాంతో ప్రణవ్ సత్తయ్యతో కలిసి ఫోటో కూడా దిగాడు.ఈ సంఘటన తన మదిలో పదిలంగా దాచుకున్న ప్రణవ్ సత్తయ్య ఋణం తీర్చుకోవాలని భావించాడు అనుకున్నదే తడవగా సత్తయ్య కోసం వెతుకుతూ అతడు చనిపోయాడని తెలుసుకుని ఆయన కుటుంబానికి రూ.25 వేలు అందించారు.ఇలాంటి సంఘటనలు ప్రస్తుత కాలంలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి కాబట్టే ప్రణవ్ 12 ఏళ్ళ స్టోరీ వైరల్ అవుతోంది.