బిజెపి తెలుగుదేశం పార్టీల పొత్తు విషయమై చాలా కాలం నుంచి చాలా రకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి.ఏదోరకంగా 2024 ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ సహకారంతో 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనే ఆలోచనలో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.
అందుకే పదేపదే ఢిల్లీ బిజెపి పెద్దలను పొగుడుతూ, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .కానీ బీజేపీ అగ్రనేతలు ఎవరినీ దగ్గర చేసుకునేందుకు, టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఇష్టపడడం లేదు.అయినా పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ఈ పొత్తుల వ్యవహారం పై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అయితే బిజెపిలోని ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టిడిపితో పొత్తు విషయంలో కొంత మంది అనుకూలంగా ఉంటే, మరి కొంతమంది ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీ కీలక నాయకులు జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్ వంటివారు టీడీపీ విషయంలో ఘాటుగానే స్పందిస్తూ ఉంటారు.
అసలు ఆ పార్టీతో తమకు పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదు అంటూ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.ఈ తరహా వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ స్పందించారు.
బిజెపి ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం బిజెపి జాతీయ అధ్యక్షుడు మాత్రమేనని అన్నారు.
రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని , ఎవరితోనూ పొత్తు పెట్టుకోవచ్చని సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చారు.పరోక్షంగా టీడీపీతో పొత్తు విషయమై సీఎం రమేష్ స్పందించినట్లు గా అర్థమైంది.టీడీపీతో పొత్తు ను వ్యతిరేకిస్తున్న బీజేపీలోని కొంతమంది నాయకులకు కౌంటర్ ఇచ్చే విధంగా సీఎం రమేష్ వ్యాఖ్యలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఏపీ వ్యవహారాలను చూసే నాయకులు ఎవరు స్పందించలేదు.ఈ పొత్తు అంశంలో బిజెపి రెండుగా చీలినట్టే కనిపిస్తోంది.
నాయకులు ఎన్ని వివాదాలకు దిగినా , బిజెపి అధిష్టానం నిర్ణయం ప్రకారమే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు.