హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటి నుండి టీఆర్ఎస్, బీజేపీ మధ్య భీకర పోటీ పరిస్థితి ఉన్నా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరువాత రెండో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ మొదట్లో పోటీపై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతగా ఆసక్తి కనబరచకున్నా ఆ తరువాత కాంగ్రెస్ లో జరిగిన అంతర్గత చర్చల్లో భాగంగా మరల ఎన్ఎస్యూఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్ ను అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే ఈ ఉప ఎన్నిక వచ్చిందే ఈటెలకు, టీఆర్ఎస్ మధ్య వైరంతో కాబట్టి ఎన్నిక ప్రచారం ఆసాంతం బీజేపీ, టీఆర్ఎస్ ఆమధ్య రగడ మాత్రమే ప్రజల్లో ఉండే అవకాశం ఉంది.ఎందుకంటే ఇక్కడ ఈ ఉప ఎన్నిక కు ఆజ్యం పోయడానికి కాంగ్రెస్ ఏ మాత్రం కారణం కాదు.
అందుకే ఈ పోలింగ్ లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో చర్చ రాకపోవడమే కాకుండా కొన్ని చోట్ల కాంగ్రెస్ పోటీ లో ఉందన్న విషయం కూడా తెలియలేదంటే బీజేపీ- టీఆర్ఎస్ మధ్య పోరు ఎంత మేర క్షేత్ర స్థాయి వరకు వెళ్లిందో ఇక మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు అంతగా గెలిచేందుకు అవకాశం లేదన్న విషయం కాంగ్రెస్ కు ముందుగానే ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వెళ్లినంత దూకుడుగా వెళ్లని పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అంతర్గతంగా మద్దతు పలికిందని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తీసుకున్న ఆచితూచి నిర్ణయాలు సరైనవని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.
గెలిచేందుకు అవకాశం లేని స్థానంలో చాలా రకాలుగా కష్టపడ్డా ఫలితం ఉండదని ముందే క్లారిటీ ఉన్న నేపథ్యంలో కొద్దిగా బలంగా పోరాడకున్నా పార్టీకి పెద్దగా నష్టం ఉండదు.