కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.దీంతో సామాన్య, మధ్యతరగతి జీవితాలు దుర్బరంగా మారాయి.
చిన్న దేశాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.ఆర్థికంగా చితికిపోవడంతో ఓ చిన్న దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్లే ఆ దేశ ప్రజలు ప్రస్తుతం ఆకలితో అలమటించాల్సిన పరిస్థితులు వచ్చాయి.ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.1195 గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో.ప్రజలు తిండి దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ దారుణ పరిస్థితులు ఆఫ్రికా ఖండంలోని ఏదో ఒక దేశంలో తలెత్తాయి అనుకుంటే పొరపాటే.మన పొరుగున ఉన్న బుడ్డ దేశం శ్రీలంకలో ప్రజల ఆకలి కేకలు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది.
మన దేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ఆకాశమార్గంలో ప్రయాణిస్తే కేవలం 40 నిమిషాల్లో శ్రీలంకకు చేరుకోవచ్చు.అయితే, ఇప్పుడు అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి.
వస్తువులపై శ్రీలంక గవర్నమెంట్ నియంత్రణ ఎత్తేయటంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా వస్తువుల ధరలను భారీగా పెంచేస్తున్నారు.శ్రీలకంలో ఈ సంక్షోభం ఎలా ఏర్పడిందనేది అసలు ప్రశ్న.ప్రచ్ఛన్న యుద్ధం సాగిన సమయంలో ఇంతటి దారుణ పరిస్థితులు ఆనాడు లేవు.అక్కడ ఆర్థిక సంక్షోభం రావడానికి గల కారణాలు ఏమిటని ఆలోచిస్తే ప్రభుత్వ అనాలోచిత, తప్పుడు నిర్ణయాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
శ్రీలంక దేశానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజం.కరోనా కారణంగా టూరిజం మొత్తం కుదేలైంది.అయితే, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో అక్కడి పాలకులు విఫలమయ్యారు.దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తి ప్రస్తుతం అక్కడి ప్రజలు ఆకలితో అటమటిస్తున్నారు.ఆ దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గడంతో దిగుమతులపై పరిమితులు విధించారు.డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేకపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోయాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు అక్రమంగా నిత్యావసర సరుకులను నిల్వ చేసి మార్కెట్లలో కొరత సృష్టిస్తున్నారు.దీంతో ధరలు మండిపోతున్నాయి.గ్యాస్ సిలిండర్ రూ.2657కు పెరిగింది.పప్పులు, ఉప్పు, పంచదార, గోధమపిండి వంటివి సామాన్యుడికి అందుబాటులో లేవు.ఈ క్రమంలోనే దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించి ధరలపై నియంత్రణ ఎత్తేయాలని నిర్ణయించడంతో ధరలు మరింత పెరిగిపోయాయి.