తెలుగు తేజం, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు మరింత గుర్తింపు దక్కేలా చొరవ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.ఇప్పటికే ఆయన శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కూడా.
తాజాగా పీవీ కీర్తిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.దీనిలో భాగంగా ప్రపంచంలోని ఐదు దేశాల్లో పీవీ నరసింహారావు విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.
ఇందుకు వివిధ దేశాల్లో స్థరపడిన తెలుగు ఎన్ఆర్ఐల సహకారం కూడా తీసుకోనున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత అమెరికాలోని అట్లాంటా, జార్జియాలలో ఈ నవంబర్‌లో పీవీ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించి పలు తెలుగు సంఘాలతో కేసీఆర్ భేటీ అయ్యారు.వీరందరితో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ బీగాల సమన్వయం చేసుకుంటున్నారు.
ఇక పీవీ నరసింహారావు విగ్రహాలు నెలకొల్పాల్సిన మిగిలిన మూడు ప్రాంతాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.వీటిపై తెలుగు ప్రవాసులతో చర్చించనున్నారు ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ (ఐఏసీఏ) వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ పాడి శర్మ.
పీవీ నరసింహారావు ప్రస్థానం:
పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలోని లక్నేపల్లిలో జన్మించారు.ఆయన తండ్రి సీతారామారావు, తల్లి రుక్మాబాయి.
అయితే.పీవీకి మూడేళ్ల వయసులోనే పీ రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు.
దీంతో నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వంగరలో పెరిగారు.హన్మకొండలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిని పీవీ నరసింహారావును పీవీ వందేమాతరం ఉద్యమం ఆకర్షించింది.
దీంతో ఆ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.మహారాష్ట్రలోని పుణె ఫెర్గొసన్ కాలేజీలో బీఎస్సీ అంతరిక్ష పరిశోధన (ఆస్ట్రానమీ) చేశారు.
ఆ తర్వాత నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తిచేశారు.ఎల్‌ఎల్‌బీలో ఆయన గోల్డ్‌మెడల్ సాధించారు.
అనంతరం హిందీలో సాహిత్యరత్న చేశారు.
1952లో కరీంనగర్‌లోని హుజురాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పీవీ .కమ్యూనిస్ట్ నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు.ఆ తర్వాత 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.1977, 1980 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.1984, 1989 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండతో పాటు మహరాష్ట్రలోని రాంటెక్ లోక్‌సభ స్థానాల నుంచి పీవీ పోటీ చేశారు.
1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది.దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యా శాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది.1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు.ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూసంస్కరణలు తీసుకొచ్చారు.
దాదాపు రాజకీయాల నుంచి నిష్క్రమించిన పీవీని 1991 కాంగ్రెస్ అధిష్టానం ఏరి కోరి ప్రధానిని చేసింది.మైనార్టీలో పడ్డ ప్రభుత్వాన్ని తన మేథస్సుతో ఐదేళ్ల పాటు నడిపిన నరసింహారావు.
ఆర్ధిక సంస్కరణలతో భారతదేశ గతిని మార్చేశారు.ఆర్థిక నిపుణులైన మన్మోహన్ సింగ్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించి సంస్కరణల బాట పట్టించారు.
అద్భుతమైన ఫలితాలు సాధించి అపర చాణక్యుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు.