ఏపీలో టీడీపీ కి విషయం అర్థం అయిందో లేదో తెలియదు గాని, చాపకింద నీరులా బీజేపీ ఏపీలో విస్తరిస్తూ వస్తోంది.అధికార పార్టీ వైసీపీని పూర్తిగా పక్కన పెట్టి దృష్టి మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే పెట్టినట్టుగా కనిపిస్తోంది.
ఈ మేరకు బిజెపి అగ్ర నాయకుల నుంచి, రాష్ట్ర నాయకుల వరకు అందరూ ఇదే రకమైన ఆలోచనతో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.
ఈ మేరకు పార్టీ నాయకుల్లో జోష్ నింపడంతో పాటు, మరింత ఉత్సాహం పెరిగే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ, ఏపీ నేతలను ఉత్సాహ పరుస్తున్నారు.
ఏపీలో బలపడాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనం చేసి, ఆ పార్టీ స్థానం బీజేపీ ఆక్రమిస్తే, అది వర్కౌట్ అవుతుంది అని పదేపదే బిజెపి నేతలకు ఆయన నూరిపోస్తున్నారు.
ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఏపీ బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీపై విమర్శలు మొదలు పెట్టినట్లు అర్థమవుతోంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్రమైన పదజాలంతో విమర్శించేందుకు వెనకడుగు వేయడం లేదు.
అవినీతి వ్యవహారాలు కానీ, ఇతర వయ్వహారాల్లో కానీ, టిడిపిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, ఆ విమర్శలకు స్పందించేందుకు టిడిపి నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.బిజెపి ఎంత ఘాటుగా విమర్శలు చేస్తున్నా, టిడిపి ఆ విమర్శలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోంది.బీజేపీపై అనవసర విమర్శలు చేసేకంటే ఏదో ఒక రకంగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తో అనవసరంగా వివాదం పెట్టుకుంటే, జరిగే నష్టమేంటి అనేది టిడిపికి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కు బాగా తెలుసు.
అందుకే బిజెపి తమపై ఎన్ని విమర్శలు చేస్తున్నా, నోరు మెదపకుండా మౌనంగానే వాటిని భరిస్తూ వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.