తెలంగాణ రాష్ట్రంలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు.అయితే అత్యాచారాలు తగ్గడం అనే మాట అటుంచితే దిశా ఘటన జరిగినప్పటి నుంచి రోజుకో అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది.
తాజాగా ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై అక్కడే ల్యాబ్ ఇన్చార్జిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని పెట్ పేట్ బషీరాబాద్ లో ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది.
అయితే ఇదే కాలేజీలో వెంకటేష్ అనే వ్యక్తి ల్యాబ్ ఇన్చార్జిగా చేస్తున్నాడు.అయితే ఇతడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.దీంతో అప్పటికే పలువురు విద్యార్థునిలు వెంకటేష్ పై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా అతడి పై చర్యలు తీసుకోలేదు.అయితే తాజాగా బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని బెదిరించి కాలేజీ లోని ల్యాబ్ కి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడు.
అంతేగాక ఈ విషయం గురించి కాలేజీలో ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో ఆ యువతి ఏం చేయాలో తెలీక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో వెంకటేష్ పై కేసు నమోదు చేశారు.దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అయితే బాధితురాలు తల్లిదండ్రులు ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని తమ స్థోమతకు మించి డబ్బులు కట్టి ఇలాంటి కాలేజీలో చదివిస్తుంటే చివరికి కాలేజీలో పనిచేసే వారే అత్యాచారాలకు పాల్పడితే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుందని వాపోతున్నారు.
కావున ఇప్పటికైనా విద్యార్థునులపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వెకంటేష్ ని కఠినంగా శిక్షించాలని కాలేజీ యాజమాన్యాన్ని కోరుతున్నారు.