తెలంగాణలో ఉనికి కోసం అష్టకష్టాలు పడుతోన్న టీడీపీ పార్టీ బలోపేతంపై కాన్సంట్రేషన్ చేయడం మానేసి కలహాల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.ఇప్పటికే పార్టీలోని చాలా మంది నాయకులతో పాటు సీనియర్లందరూ పార్టీని వదిలేసి అధికార గులాబీ గూటికి చేరిపోయారు.
ఇప్పుడు తెలంగాణ టీడీపీలో రేవంత్‌రెడ్డి వన్ మ్యాన్ షో నడుస్తోంది.
రేవంత్ దూకుడుతో పార్టీలో మిగిలి ఉన్న నాయకులు తెరవెనక్కు వెళ్లిపోతున్నారు.
వారి వాయిస్ ఎక్కడా వినపడడం లేదు.దీంతో వారంతా రేవంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు సైతం రేవంత్‌కే ప్రయారిటీ ఇవ్వడంతో వాళ్లు చేసేదేం లేక మిన్నకుండిపోతున్నారు.వీరు రేపు ఎన్నికలకు కాస్త అటూ ఇటూగా ఎప్పుడైనా టీఆర్ఎస్ లేదా ఇతర పార్టీల్లోకి జంప్ చేసేయడం ఖాయం.
ఇదిలా ఉంటే రేవంత్ దూకుడుతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పూర్తి డమ్మీ అయిపోయారు.
ఇక ఆలూ లేదు చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇక్కడ పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన వేళ టీడీపీలో అప్పుడే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పాట్లు, ఫీట్లు మొదలైపోయాయి.రేవంత్‌రెడ్డి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు డిసైడ్ చేసేది తానేనని హింట్లు ఇస్తున్నారట.
ఎవరికి ఏ టిక్కెట్టు ఇవ్వాలో తానే డిసైడ్ చేస్తానని రేవంత్ చెపుతోన్న వార్తలు లీక్ అయ్యి మిగిలిన సీనియర్ నాయకుల వరకు వెళ్లాయి.దీంతో పార్టీలో ఉన్న సీనియర్లు, వారి అనుచరులు రేవంత్‌పై మండిపడుతున్నారు.
ఇది టీటీడీపీని మరింత నిర్వీర్యం చేసేదిగా కనపడుతోంది.
ఇక రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు రమణ సైతం రగిలిపోతున్నట్టు టాక్.
రమణ ఇప్పటి వరకు తనకంటూ ఓ వర్గాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు వాళ్లకు కూడా రమణ టిక్కెట్లు ఇప్పించుకునే పరిస్థితి ఉందా ? అంటే డౌటే అన్న ఆన్సర్ వస్తోంది.దీంతో రమణ వర్సెస్ రేవంత్ పోరు టీటీడీపీలో సెగలు రేపుతోంది.చంద్రబాబు వీరి గొడవను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో రమణ పార్టీలో ఉంటారా ? బయటకు వెళతారా ? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.