అమెరికాలోని( America ) తెలుగు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.సముద్రంలో మునిగిపోతున్న కుమారుడిని కాపాడుతూ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది.మృతుడిని జొన్నలగడ్డ శ్రీనివాస మూర్తి( Jonnalagadda Srinivasa Murthy )గా గుర్తించారు.
గతవారం శాంతాక్రజ్‌లోని పాంథర్ బీచ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.తన కుమారుడిని ఓ బలమైన అల సముద్రంలోకి లాక్కెళ్లిపోతోందని గమనించిన మూర్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరుగులు తీశాడు.
ఎలాగోలా కుమారుడిని రక్షించగలిగినప్పటికీ.దురదృష్టవశాత్తూ శ్రీనివాసమూర్తిని మరో అల వెనక్కి లాగడంతో ఆయన సముద్రంలో గల్లంతయ్యారు.
ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర సిబ్బంది హుటాహుటిన శ్రీనివాసమూర్తిని రక్షించారు.స్పృహలో లేకపోవడంతో సీపీఆర్ చేసి.ఆపై కాలిఫోర్నియా హైవే పెట్రోల్ హెలికాఫ్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో స్టాన్‌ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసమూర్తి కన్నుమూశారు.
అయితే అంత్యక్రియల ఖర్చులు, మెడికల్ బిల్లులు, ఇతర ఆర్ధిక సమస్యల నేపథ్యంలో శ్రీనివాస మూర్తి కుటుంబానికి సహాయం చేయడానికి GoFundMe పేజీలో విరాళాలు సేకరిస్తున్నారు.ఆయన మరణం పట్ల స్థానిక ఇండియన్ కమ్యూనిటీ దిగ్భ్రాంతికి గురైంది.
ఇదిలావుండగా.ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలోని ఇండియానాపోలిస్ డౌన్‌టౌన్‌కు నైరుతి దిశలో 64 మైళ్ల దూరంలో వున్న మన్రో సరస్సులో గల్లంతై ఇద్దరు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.వీరిని ఇండియానా యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు సిద్ధాంత్ షా (19), ఆర్యన్ వైద్య (20)గా( Siddhant shah ) గుర్తించారు.10,750 ఎకరాలు విస్తీర్ణం, 35 నుంచి 40 అడుగుల లోతున్న ఈ సరస్సులో మృతులు, వారి స్నేహితులు ఈత కొట్టడానికి ముందు పాంటూన్‌పై బోటింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సిద్ధాంత్, ఆర్యన్‌లు ప్రమాదవశాత్తూ సరస్సులో పడిపోయారు.వీరిని కాపాడేందుకు తోటి స్నేహితులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.వీరిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్యాధునిక సోనార్, అనుభవజ్ఞులైన స్కూబా డైవర్లను ఉపయోగించి సరస్సు అడుగు భాగంలో గాలించారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగా తొలి రోజు రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు.
చివరికి ఏప్రిల్ 18న పేన్‌టౌన్ మెరీనాకు తూర్పున సరస్సుకు 18 అడుగుల లోతులో వీరి మృతదేహాలను గుర్తించారు.