ప్రస్తుతం హైతీ దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది.ఇప్పటికే హైతీలో గ్యాంగ్ మర్డర్స్, హింసాత్మక ఘటనలు ఎక్కువ అయిపోయాయి.
అంతేకాకుండా కొన్నేళ్లుగా ఈ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో పాటు, ఆహార కొరత కూడా తీవ్రంగా ఉంది.ఇప్పుడు మళ్ళీ హైతీ దేశ అధ్యక్షుడు అయిన జావెనెల్ మోసెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేసి చంపేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
మోసే హత్యను స్వయంగా మంత్రి క్లాడ్ జోసెఫ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.మంగళవారం అర్థరాత్రి కొందరు ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే విదేశీయులు అధ్యక్షుడిని తన ఇంటి వద్ద హత్య చేశారని జోసెఫ్ చెప్పారు.
జావెనల్ తో పాటు ఆయన భార్య మార్టిన్ పై కూడా దాడి చేశారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మార్టిన్ మోసెని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారని క్లాడ్ జోసెఫ్ తెలిపారు.
దేశాధ్యక్షుడి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ప్రధాని క్లాడ్ జోసెఫ్ ఈ హత్యను ఒక ద్వేషపూరితమైన చర్యగా, అనాగరిక చర్యగా పేర్కొన్నారు.హైతీ అధ్యక్షుడి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జావెనల్ 2016లో నవంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు.ఆ తరువాత 2017 ఫిబ్రవరిలో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
కానీ హైతీ అధ్యక్షుని పదవీ కాలం 2016లో ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి.దీంతో మోసె పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయగా అందుకు మోసే నిరాకరించారు.మోసే మాత్రం 2017లో తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని అంటే 2022 ఫిబ్రవరి వరకు తన పదవీకాలం ఉందని వాదించారు.ఈ క్రమంలో మోసే హత్య హైతీ రాజకీయాల్లో తీవ్ర గందరగోళం సృష్టించింది.