రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలను ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు.మంగళవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రధాన దేవాలయాల ఆన్ లైన్ సేవల పోర్టల్ aptemples.gov.in ను ఆయన ప్రారంభించారు.తదుపరి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దశల వారీగా ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇప్పటికే శ్రీశైలం దేవస్థానంలో పైలెట్ ప్రాజెక్టుగా ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తేవడం జరిగిందని, ఆ ప్రాజెక్టు విజయవంతంగా అమలు అవ్వడంతో రాష్ట్రంలోని మరో ఎనిమిది దేవాలయాలకు ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తూ ఆన్ లైన్ పోర్టల్ ను నేడు ప్రారంభించడం జరిగిందన్నారు.బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయం, ద్వారకా తిరుమల దేవాలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయం, శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయం, శ్రీ కాళహస్తి దేవాలయం, కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మరియు పెనుగ్రంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ వారి దేవాలయంలో ఆన్ లైన్ సేవలు నేటి నుండి అందుబాటులో వస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ విధంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలోని తొమ్మిది ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందని, అదే విధంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన దేవాలయాల్లో దశల వారీగా ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ఎన్నో అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని నిత్యం పలు ఆరోపణలు, వార్తలు వస్తున్నాయని, వీటన్నింటినీ అరికట్టేందుకు ఈ ఆన్ లైన్ విధానం ఎంతగానో దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఆయా దేవాలయాల్లో స్వామి వారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి సౌకర్యాలు, ఇ-హుండీ, డొనేషన్ల ఆఫర్లు మరియు ప్రసాద విక్రయాలు అన్నీ ఆన్ లైన్ ద్వారా జరుగుతాయని, ఈ సేవలు అన్నింటినీ భక్తులు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు.ఈ విధానం వల్ల దేవాలయాల్లోని పలు కార్యక్రమాలు అన్నీ ఎంతో పారదర్శకతతోపాటు మరింత భద్రత, పటిష్టతతో నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
అదే విధంగా తదుపరి దేవాలయాల భూములను అన్నింటినీ గుర్తించి, జియోట్యాగింగ్ చేసి, దేవాలయాల ఆస్తులు, ఆభరణాలు అన్నింటినీ డిజిటలైజ్ చేసే ప్రాజక్టును కూడా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఇందుకు సంబందించిన పైలెట్ ప్రాజెక్టును శ్రీ శైలం దేవాలయంలో అమలు పర్చేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ హరి జవహర్ లాల్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.భ్రమరాంబ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.