తెలంగాణలో ఉపాధి హామీని నిలిపేందుకు కేంద్రం కుట్ర!తనిఖీల పేరుతో సమస్యలు సృష్టిస్తున్న కేంద్రంపశ్చిమ బెంగాల్ తరహా, మన రాష్ట్రంలో చేస్తామంటే చెల్లదు కేంద్రానికి గట్టిగా జవాబు చెప్పిన రాష్ట్రం మంచిగా పని చేసి, ప్రభుత్వానికి, మీ గ్రామాలకు మంచి పేరు తేవాలి సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, టీఆరెఎస్ కార్మిక విభాగం అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర వ్యాప్త ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఉపాధి హామీ అమలులో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, అందుకే రకరకాల తనిఖీలతో, కొర్రీలతో వేధించే ప్రయత్నం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోలా తెలంగాణలో చేద్దామంటే కుదరదని, ఇక్కడి ప్రజలు తిరబడతారని మంత్రి చెప్పారు.
హైదరాబాద్ (సికింద్రాబాద్) బోయినపల్లి మల్లా రెడ్డి ఫంక్షన్ హాలులో రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, టీఆరెఎస్ కార్మిక విభాగం అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర వ్యాప్త ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభ ను జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సమస్యలు సృష్టించి, మొత్తం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్ర పన్నుతున్నది.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఇలాగే కక్ష కట్టి గత ఆరు నెలల నుండి ఉపాధి హామీ పథకాన్ని ఆ రాష్ట్రంలో నిలిపివేశారు.బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలైన చత్తీస్ గడ్, రాజస్థాన్, పంజాబ్ ఇప్పటికే… పర్యవేక్షక టీం లను పంపించి, లేనిపోని ఆరోపణలు మొదలు పెట్టారు.
మన తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2018 వరకు కేవలం 3 టీం ల ను పంపిస్తే, ఈ ఏడాది ఇప్టపికే 3 టీంలు ఒకసారి, 15 టీం లు ఒకసారి చొప్పున మొత్తం 18 టీం లను పంపించి లేని తప్పులను ఎత్తి చూపి, పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని మంత్రి వివరించారు.
ఉపాధి హామీ పథకం (పూడిక తీత) మొదలైనప్పటి నుంచి చెరువుల్లో కేవలం పూడిక తీత తీస్తున్నారు.
కానీ, ఇన్నేండ్ల తర్వాత పూడిక తీత ఎక్కువ తీయొద్దని చెబుతున్నారు.మన రాష్ట్రంలో ఈ పనులు కేవలం.11శాతంగా ఉన్నాయి కానీ, ఆంధ్రప్రదేశ్ 19శాతం, చత్తీస్ గడ్ 18శాతం, పంజాబ్ 20శాతం, గుజరాత్ 16శాతం చేస్తే మాత్రం చప్పుడు లేదు.హరిత హారంలో మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేయడంలో మల్టీ లేయర్లలో మొక్కలు పెడితే, ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
వెదురు కంచెలు వేయాలని చెబుతున్నారు.అయితే, అన్ని రాష్ట్రాల్లో వెదురు లభ్యత లేదని మంత్రి అన్నారు.హరిత హారం వల్ల 7.5శాతం పచ్చదనం పెరిగిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయి.మొక్కలు పెంచడండ వల్ల గత రెండు, మూడు ఏండ్ల నుండి వర్షాలు సకాలంలో పడుతున్నాయి.పచ్చదనం మొదలైతే, తెలంగాణ బార్డర్ వచ్చిందని ఇతర రాష్ట్రాల లారీ డ్రైవర్లు చెబుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.
రైతు కల్లాలు కడితే, అది అనుమతి లేని పని అంటున్నారు కానీ, తీర ప్రాంత రాష్ట్రాల్లో చేపలు, రొయ్యలు ఎండ బెట్టుకోవడానికి అనుమతిస్తున్నారు.కాళేశ్వరం మరియు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల దేశంలోనే నెంబర్ వన్ గా విపరీతమైన పంటలు పండిస్తున్నాం.
ఆ పంటలను ఆరబెట్టుకోవడానికి రైతులకు కల్లాలు కడితే వద్దంటున్నారు.ఇంతకుముందు పేద కూలీలకు గడ్డపార, తట్ట మొదలైన పని ముట్లు ఇచ్చే వాళ్ళం.కానీ, ఇలాంటి సౌకర్యాలకు కూడా కేంద్రం కోత పెట్టింది.పేద కూలీల కోసం ఏ సౌకర్యం కల్పించాలన్నా, కేంద్రం అడ్డు పడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, దేశ వ్యాప్తంగా ఇప్పటికే 75వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో తగ్గించడం జరిగింది.దీన్ని ఇంకా తగ్గించి, ఉపాధి హామీ పథకాన్నే రద్దు చేసి, పేదల నోట్లో మట్టి కొట్టాలని కేంద్రం చూస్తున్నదని మంత్రి దయాకర్ రావు ఆరోపించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల కు అండగా ప్రభుత్వం
మరోవైపు గతంలో కొందరి స్వార్థానికి ఫీల్డ్ అసిస్టెంట్లు బలయ్యారు.తొందరపాటు వల్ల కొంత ఇబ్బంది పడ్డారు.నేను అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేదు.సీఎం కెసిఆర్ గారి పెద్ద మనసుతో ఫీల్డ్ అసిస్టెంట్ల కు మళ్ళీ మంచి అవకాశం వచ్చింది.
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళతాను.మంచిగా పని చేసి, ప్రభుత్వానికి, మీ గ్రామాలకు మంచి పేరు తేవాలి అని హితవు పలికారు.
రాజస్థాన్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో ఇంకా కేవలం 5వేల నుండి 8 వేల రూపాయలు వేతనంగా ఇస్తున్నారు.ఇక్కడ తెలంగాణలో 10వేల వేతనం పొందుతున్నారు.
మీరంతా నేను ఎన్ని సార్లు చెప్పినా వినకుండా కొంత మంది స్వార్థపరుల మాటలు నమ్మి సమ్మెకు వెళ్ళారు.చాలా మంది మీకు వ్యతిరేకంగా చెప్పినా, గౌరవ సిఎం గారి చొరవతో మళ్ళీ విధుల్లోకి వచ్చారు.
మీకు ఏమైనా సమస్యలుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారు.అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు పేదల కోసం బాగా పని చేసి, వారికి ఎక్కువ లాభం కలిగేట్లు చూడాలి.
అలాగే ఈ ఏడాది పని తీరుని బట్టి బాగా పని చేస్తే వచ్చే ఏడాది నుండి 5శాతం వేతనం పెంచమని గౌరవ సిఎం గారిని అడగవచ్చు అని మంత్రి తెలిపారుఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, మర్రి రాజ శేఖర్ రెడ్డి, టీఆరెఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, పార్టీ కార్యదర్శి రూప్ సింగ్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నేతలు మేకల రవి, కంకల సిద్ధిరాజ్, దయామణి, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు
.