గులాబీ పార్టీకి సర్వాధికారి కేసీఆర్.పార్టీలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో నిర్ణయించేది ఆయనే.
టీఆర్ఎస్ స్థాపించినప్పటినుంచీ ఈ విషయం అందరికీ తెలుసు.కాని ఈసారి టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది ఆయన కాదట.
కేసీఆర్ కాకపోతే కేటీఆరా? కాబోమే ముఖ్యమంత్రి కూడా కాదట…మరి రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీలో టిక్కెట్లు ఇచ్చేదెవరు?.
ఎన్నికలు వచ్చినపుడు అభ్యర్థులకు పార్టీ అధినేత టిక్కెట్లు ఖరారు చేస్తారు.
లేదంటే కొంతమంది నాయకులు చర్చించుకుని ఖరారు చేస్తారు.సహజంగా ఏ పార్టీ అయినా టిక్కెట్లు ఇచ్చే విధానం ఇదే.తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు, మరికొందరు కలిసి ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లు ఖరారు చేస్త్రున్నారు.కాని ఈసారి పద్దతి మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించిన కేసీఆర్ ఈసారి కూడా మందస్తుకు వెళతారని చెబుతున్నారు.ముందస్తు అవసరమే లేదని ఒకానొక సమావేశంలో కేసీఆర్ ఖండించినా…వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అయిన కేసీఆర్ తన వ్యూహాలతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నారు.అయితే ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందనే ఆందోళన మధ్య కేసీఆర్ కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ టీమ్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి తెలుసుకున్న అంశాలు కేసీఆర్ కు షాక్ ఇచ్చినట్లుగా సమాచారం.సిటింగ్ ఎమ్మెల్యేల్లో సగానికిపైగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు పీకే ఇచ్చిన నివేదిక సారాంశంగా చెబుతున్నారు.
సగం మందికి పైగా ఎమ్మెల్యేలను ఈసారి మార్చాల్సిందే అని పీకే సూచించినట్లు తెలుస్తోంది.గడువు ప్రకారం ఎన్నికలకు వెళితే ప్రస్తుత ఎమ్మెల్యేలను దారికి తెచ్చి వ్యతిరేకతను కొంతవరకు తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు.
అయితే ముందస్తుకు వెళితే మాత్రం వారి పట్ల వ్యతిరేకతను తట్టుకోవడం సాధ్యం కాదని సూచించినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సర్వాధికారులని కేసీఆర్ పార్టీ సమావేశంలోనే చెప్పడంతో వారంతా చెలరేగిపోయారు.వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం, అనుచరుల కోసం ఎలా వీలైతే అలా విచ్చలవిడిగా సంపాదించుకుంటూ…ప్రజా సమస్యలు పట్టించుకోకుండా…తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారు.ఇప్పుడదే వారి కొంప ముంచేట్లుగా మారింది.
ముందస్తుకు వెళితే మాత్రం సగం మందిని మార్చడం ఖాయమంటున్నారు.ఎమ్మెల్యే తర్వాతి రెండో శ్రేణి నాయకులను ప్రోత్సహించడం ద్వారా వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
వారిని కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్ణయిస్తుందని తెలుస్తోంది.
ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరగకముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇప్పటికే కావాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.మరి అభ్యర్థులను మారుస్తారా? గడువు పూర్తయ్యేవరకు ఆగుతారా? అసలు కేసీఆర్ ఆలోచన ఏంటి? ముందస్తుపై ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా ఏంటి?
.