తన ఇంటి పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్ట్ 10 నెలల పది వారాల జైలు శిక్ష విధించింది.నిందితురాలిని 38 ఏళ్ల దీప కళా చంద్రశేఖరన్‌గా గుర్తించారు.
అలాగే పనిమనిషిగా వున్న ఎని ఆగస్టిన్‌కు 4,000 సింగపూర్ డాలర్ల పరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.ఈ మేరకు డిస్ట్రిక్ట్ జడ్జి ఓవ్ యోంగ్ టక్ లియోంగ్ శిక్షను ఖరారు చేశారు.
ఈ ఏడాది జనవరిలో జరిగిన విచారణ అనంతరం ఆయన తాజాగా తుది తీర్పును వెలువరించారు.
డిసెంబర్ 9, 2019న దీపకళ ఫ్లాట్‌లో ఎని అగస్టిన్ పని చేయడం ప్రారంభించారని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జనవరిలో కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.
అయితే పనిలో చేరిన 16 రోజుల తర్వాత కిచెన్ డ్రాయర్‌లో వస్తువులను ఉంచేటప్పుడు కొన్ని కత్తిపీటలను కూడా పెట్టడంతో అగస్టిన్‌పై దీపకళ నోరుపారేసుకుంది.అంతేకాకుండా తన చూపుడు వేలిని చూపిస్తూ ఎని నుదిటిపై పదే పదే పొడిచింది.
తర్వాత 2020లో చెక్క హ్యాంగర్‌తో ఎనిని తీవ్రంగా కొట్టింది.మరొక సందర్భంలో అగస్టిన్ చెంపలను పగులగొట్టింది.
అయితే అదే ఇంటిలో పనిచేస్తున్న సహాయకులలో కొందరు ఎని శరీరంపై వున్న గాయాలను గమనించి.
డొమెస్టిక్ ఎంప్లాయిస్ కాల్ సెంటర్‌కు సమాచారం అందించారు.దీంతో వారు పోలీసులను అప్రమత్తం చేశారు.అయితే తన ఇంటికి పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న దీపకళ ముందు జాగ్రత్తగా .ఎనికి ఐస్ ప్యాక్ ఇచ్చి, ఒంటిపై వున్న గాయాల గురించి పోలీసులకు అబద్ధం చెప్పాల్సిందిగా సూచించింది.బాడీ స్క్రాచింగ్ ట్రీట్‌మెంట్ చేయించుకున్న సమయంలో తనకు ఈ గాయాలు తగిలినట్లు పోలీసులకు చెప్పాలని ఎనిని దీపకళ కోరింది.
అక్కడితో ఆగకుండా ఎని ముఖంపై వున్న గాయాలు కనిపించకుండా మందంగా మేకప్ వేసింది.
దీనిని గమనించిన పోలీసులు.మేకప్ తుడిచి వేయాల్సిందిగా ఎనిని ఆదేశించారు.ఆమె మెకప్‌ను తుడుస్తుండగా గాయాలు బయటపడ్డాయి.
దీంతో ఒక్కసారిగా ఎని కన్నీటిపర్యంతమైంది.అయితే తనపై అగస్టిన్ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని, ఆ గాయాలకు తనకు సంబంధం లేదని దీపకళ స్పష్టం చేసింది.
అగస్టిన్ తనను తన దేశానికి పంపించాలని కోరుతోందని.ఈ క్రమంలోనే సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని దీపకళ ఆరోపించినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.