అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరగడానికి కృషి చేస్తానని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు.సోమవారం అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నాయకులు సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఖమ్మం పార్టీ కార్యాలయం నందు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షల మంది ఉన్నారని, అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల విలువ సుమారుగా రూ.1000 కోట్లు ఉంటుందని, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సింది కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు డబ్బులు చెల్లిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, అగ్రిగోల్డ్ సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని తమ్మినేని వీరభద్రంను విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, ఎక్జిక్యూటివ్ సభ్యులు నల్లబోలు సునీత, మునగంటి వీరబ్రహ్మచారి, సి.హెచ్ వెంకటేశ్వర్లు, పుచ్చకాయల రాంబాబు, ఎన్.అనసూర్య, వి.చంద్రరావు, పి.విరప్పయ్య, వి.రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు