దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి,శానిటైజర్ వాడకం కూడా తప్పనిసరి అంటూ మార్గదర్శకాలు వస్తున్న సంగతి తెలిసిందే.దీనితో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం అలానే శానిటైజర్ లను తప్పనిసరిగా వాడడం వారి దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది.
అయితే ఇంతగా కరోనా ప్రబలుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రవర్తిస్తూనే ఉన్నారు.అలాంటి వారిని కట్టడి చేయడానికి మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.తాజాగా ఢిల్లీలో ఓ లాయర్ కారులో వెళ్తూ, మాస్క్ ధరించలేదంటూ పోలీసులు రూ.500 ఫైన్ వేశారు.దీనిపై లాయర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే తాను తన సొంత కారులో ఒక్కడినే ఉన్నానని, అటువంటి సమయాల్లో మాస్క్ అవసరం లేదని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని అలాంటిది నాకు జరిమానా విధిస్తారా అంటూ మండిపడ్డారు.
పోలీసుల చర్యతో తన పరువుకి భంగం కలిగిందని, తాను అన్ని నిబంధనలనూ పాటిస్తున్నానని కోర్టును ఆశ్రయించాడు.ఢిల్లీ పోలీసుల నుంచి తనకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.