అమ్మ అనే పదంలో ఉన్నవి రెండు అక్షరాలైనా అమ్మ ప్రేమ మాత్రం అనంతం.ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ భరిస్తూ తన ప్రేమను పిల్లలకు పంచేది ఒక మాతృమూర్తి మాత్రమే అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఇలా అమ్మ గొప్పతనాన్ని చాటుతూ ఎన్నో తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇలాంటి వాటిలో శారద, సత్యనారాయణ ప్రధానపాత్రలో నటించిన “అమ్మ రాజీనామా” సినిమా ఒకటి.
తేజస్వి ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ‘అమ్మ రాజీనామా’ సినిమాకి దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, కె.దేవీవరప్రసాద్, టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా 1991 డిసెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సరిగ్గా నేటితో ఈ సినిమా విడుదల అయి 30 ఏళ్ళు అయ్యింది.
ఇక ఈ సినిమాలో కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకుని తన బిడ్డలకు మనవరాళ్లకు ఏం కావాలో చూసుకుంటున్న శారద విషయంలో కొడుకులు కోడళ్ళు తప్పు పట్టడంతో ఆమె ఏకంగా తన అమ్మ పదవికి రాజీనామా చేస్తుంది.
ఇలా తన తల్లి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆపదలో ఉన్న తన కుటుంబాన్ని బయట పడేయటం కోసం ఏకంగా తన కిడ్నీలు కూడా అమ్మి తన కుటుంబాన్ని కష్టాల కడలి నుంచి బయటకు వేస్తుంది.కుటుంబం కోసం ఒక అమ్మ మాత్రమే ఈ త్యాగం చేయగలదని నిరూపించిన ఈ సినిమా అప్పట్లో ఎంతో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుందనీ చెప్పవచ్చు.