చైనాలో కరోనా విధ్వంసంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది.కేసులు తగ్గడానికి బదులుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
ఆసుపత్రులలో రోగులకు మంచం దొకరని పరిస్థితి ఏర్పడింది.శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు చోటు లేని పరిస్థితి చోటుచేసుకుంది.
నిత్యావసర మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది.ఇంతలా దిగజారుతున్న పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది.
ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ చైనాను మందలించారు.ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు చైనాలోని కీలక అధికారులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.
కరోనా డేటాను దాచిపెట్టిన చైనా
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, చైనా అధికారుల మధ్య ప్రస్తుతమున్న కరోనా కేసులు, వ్యాక్సిన్, చికిత్స తదితర వివరాలపై వివరంగా చర్చలు జరుగుతున్నాయి.చైనా కరోనాకు సంబంధించిన డేటాను దాచిపెట్టకుండా ప్రపంచంతో పంచుకోవాలని ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్యం సంస్థ అధికారులు నొక్కిచెప్పారు.
ప్రస్తుతం చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను విపరీతంగా పెంచుతున్నాయి, కేసులకు సంబంధించిన డేటాను చైనా దాచడం మరింత ఇబ్బందికరంగా మారింది.చైనాలో పారదర్శకత లోపించినందున, అక్కడ కరోనా పరిస్థితిని తెలుసుకోవడం అతిపెద్ద సవాలుగా నిలిచింది.
ఇటువంటి పరిస్థితుల్లో చైనా మరింత వివరణాత్మక సమాచారాన్ని పంచుకుంటేనే అక్కడి నిజమైన ప్రమాదాన్ని గుర్తించడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ తెలిపారు.
ఈ సమయంలో చైనాతో అప్రమత్తంగా ఉండేందుకు ఇతర దేశాలు వేస్తున్న అడుగులు వాటి స్థానంలో సరైనవేగా భావించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెబుతున్నారు.దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ చేసిన ప్రకటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ నేపధ్యంలో చైనా, హాంకాంగ్ నుండి వచ్చే పౌరులు నెగెటివ్ కోవిడ్ రిపోర్టు కలిగి ఉండటం అవసరమని భారత్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.అయితే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించింది, ఇటువంటి నిర్ణయాలు వివక్షపూరితమైనవని, ఇటువంటివి అవసరం లేదని వాదనకు దిగింది.
చైనా పౌరుల రాకపోకలకు సంబంధించి మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.ఈ విషయంలో చైనా అసంతృప్తితో రగిలిపోతోంది.అయితే వివిధ దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ స్పష్టం చేశారు.
చైనాలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే…
చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని సడలించినప్పటి నుండి, అక్కడ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి.చైనా చరిత్రలో ఇటువంటి ఘట్టం చాలా అరుదుగా కనిపించింది.
జిన్పింగ్ ప్రభుత్వం కరోనా విధానానికి సంబంధించి ఇటువంటి నిరసనను ఎదుర్కొంది, చివరికి అక్కడి ప్రజల ఒత్తిడికి తలొగ్గవలసి వచ్చింది.ఫలితంగా ఇప్పుడు చైనాలో కరోనా కేసులు అదుపులోనికి రావడం లేదు.
చైనాలో వృద్ధులకు తగినంత స్థాయిలో వ్యాక్సినేషన్ లేకపోవడం ఆందోళన కలిగించే విషయంగా మారింది.ఇంతేకాకుండా ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే చైనాలో తయారైన కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు తేలింది.