దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే క్రమంలో ఎక్కడికక్కడ భారీగా బహిరంగ సభలు నిర్వహించి, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ .ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉండడం తో , ఎక్కువగా అక్కడే భారీ బహిరంగ సభలు బీఆర్ఎస్ నిర్వహిస్తోంది.దీనిలో భాగంగానే ఈనెల 24 న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ భారీగానే ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభకు కనీసం లక్షన్నర మంది ని సమీకరించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ఉంది.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో బహిరంగ సభ ఇది .నాందేడ్ , కందహార్ లోహ సభలకు స్పందన ఎక్కువగా రావడంతో, ఔరంగాబాద్ సభ కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని నమ్మకంతో పార్టీ నాయకులు ఉన్నారు.ఔరంగాబాద్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జడ్పిటిసిలు కొంతమంది ఇటీవల కెసిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడంతో , అక్కడ పార్టీ అనుకున్న దానికంటే బాగా బలోపేతం అవుతుందనే నమ్మకం కేసీఆర్ లో కనిపిస్తోంది.
అందుకే అక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టారు .ఔరంగాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో 50 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఔరంగాబాద్ ఏర్పాట్లు ఇంచార్జి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు.

ఈ భారీ సభను సక్సెస్ చేసేందుకు రెండు వందల మంది వాలంటీర్లు పనిచేస్తారని, మూడు లక్షల మంచినీటి ప్యాకెట్లు, మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు.అలాగే వైజాపూర్, కన్నాడ్, గంగాపూర్, ఔరంగాపూర్, తదితర గ్రామాల నుంచి స్పందన ఎక్కువగా ఉందని జీవన్ రెడ్డి చెబుతున్నారు.ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభను సక్సెస్ చేసే విధంగా ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ , ప్రచార వాహనాల ద్వారా జనాల్లోకి పార్టీ తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సభ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అవుతుందనే అంచనాలు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.