సాధారణంగా ఎక్కడైనా సరే మనకు నచ్చితే ఒక విధంగా.నచ్చకపోతే మరో విధంగా ప్రవర్తన ఉంటుంది.
అదే తరహాలో మనకు నచ్చిన మనం ఇష్టపడే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం అంతా రామరాజ్యంలా కనిపిస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.అదే మనకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే అదేంటో లోకంలో జరిగే ఘోరాలు, అన్యాయాలు అన్ని కనిపిస్తాయి.
అంతేకాదు ప్రపంచంలో ఏం జరిగినా దానికి కారణం ఆ పార్టీనే అని, ఆ ప్రభుత్వం వల్లనే అంటూ సంబంధం లేకపోయినా కథనాలు సృష్టిస్తుంటారు.అలానే ఉంది ప్రస్తుతం ఏపీలో పరిస్థితి.
సీఎం వైఎస్ జగన్ పాలనను చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు ఆ పార్టీపై, ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ బురద జల్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.లోకంలో ఏదీ జరిగినా దాన్ని జగన్ కే ముడిపెట్టేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
తమ ఊహాగానాలకు కవిత్వాలు జోడించి మరీ ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారు.తాజాగా ఓ సంఘటనను ప్లాన్ చేసిన ఈ కేటుగాళ్లు నిజం అనిపించే విధంగా వార్తగా రూపొందించి పబ్లిసిటీ చేశారు.
ఏపీలో ప్రభుత్వ బడుల పరిస్థితి అంటూ కొన్ని కథనాలు వచ్చాయి.ఇవన్నీ అబద్దాలు కావడంతో వారికి బుద్ది చెప్పేందుకు ప్రభుత్వం వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధం అయింది.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి విస్సన్నపేట మండల విద్యాధికారికి ఉత్తర్వులు ఇచ్చారని తెలుస్తోంది.ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు గానూ వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే, విస్నన్నపేట జెడ్పీ హైస్కూల్ ను రూ.66 లక్షలతో నాడు -నేడు పథకం కింద ప్రభుత్వం ఆధునీకరించింది.స్కూల్ లో మంచి వసతులు ఏర్పాటు చేసింది.కొత్త బెంచీలే కాకుండా స్కూల్ ఆవరణలో పచ్చదనం, శుభ్రమైన టాయిలెట్ల సౌకర్యం కల్పించింది.దీంతో పాఠశాల ఏ వైపు చూసినా ముచ్చటపడేలా ఉంది.అయితే ఆ పాఠశాలకు కొత్త భవనాలతో పాటు అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పటిలో నిర్మించి శిథిలావస్థకు వచ్చిన అస్బెస్టాన్ రేకుల భవనాలు నిరూపయోగంగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే గత నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ పాత రేకుల భవనాల్లోకి నీరు చేరింది.దీన్ని ఆసరగా తీసుకున్న కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశ్యంతో కుట్రకు పథకం రచించారు.
ఇందులో భాగంగానే స్కూల్ ప్రారంభానికి ముందే బడి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారులను శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి, బలవంతంగా కూర్చొబెట్టి ఫోటోలు, వీడియోలు తీశారని అధికారుల విచారణలో తేలింది.అంటే స్కూల్ లో సమస్య లేకపోయినా కావాలనే ఉన్నది లేనట్లు చిత్రీకరించి వార్తను రూపొందించి జనంలోకి పంపారని అర్థం అవుతోంది.
వాస్తవానికి భిన్నంగా ఉన్న ఆ న్యూస్ ప్రభుత్వాన్ని అగౌరవ పరిచేవిధంగా ఉండటంతో సర్కార్ తీవ్రంగా పరిగణించింది.ఈ మేరకు ఘటనపై విచారణ జరిపి తప్పుడు కథనాలు రూపొందించి ప్రచారం చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.