దిశ ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చాలా ఆవేశంగా మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు.
ఏపీలో ఇలాంటి ఘటనలు జరిగితే మరణ శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తాజాగా సర్వే తేల్చింది.
ఎన్నికలపై నిఘా వేసే అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన తాజా సర్వే ఫలితాల ప్రకారం.మహిళాలపై అకృత్యాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాలో వైసీపీ దేశంలోనే మూడోస్థానంలో ఉంది.వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై అకృత్యాలకు పాల్పడిన కేసులను ఎదుర్కొంటున్నట్లుగా ఏడీఆర్ స్పష్టం చేసింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లు, మహిళలపై నేరాలకు సంబంధించిన సెక్షన్ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలను సేకరించింది.తెలంగాణలో అధికార పార్టీ టీఆరెస్‌కు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి నేరాల్లో ఉన్నట్లు తేలింది.ఇక ఏపీలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాంపై కూడా మహిళలపై వేధింపుల కేసు నమోదైనట్లు అఫిడవిట్‌లో ఉంది.
ఈ లిస్ట్‌లో మొత్తం 21 మంది చట్టసభ ప్రతినిధులతో బీజేపీ తొలి స్థానంలో ఉండగా.కాంగ్రెస్ 16 మందితో రెండోస్థానంలో, వైసీపీ ఏడుగురితో మూడోస్థానంలో ఉన్నాయి.వైసీపీ నుంచి హిందూపూరం ఎంపీ గోరంట్ల మాధవ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి మహిళలపై వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ సర్వే వెల్లడించింది.
టీఆర్‌ఎస్ నుంచి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలపై మహిళలపై అకృత్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.