యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ భూములు ఎక్కడున్నా డేగ కన్నుతో వీక్షించి,వాటిని కబ్జా పెట్టి, అక్రమంగా విక్రయించే రియల్ మాఫీయా పట్టణాలను దాటి, పల్లెలను కమ్మేసింది.పల్లెలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఎరవేసి,మభ్యపెట్టి తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొట్టేసి,ఆ వంకతో చెరువులు,కుంటలు,ప్రభుత్వ భూములను కబ్జా కబ్జా చేయడం,తిరిగి అధిక రేట్లకు విక్రయించి,అడ్డదారుల్లో సొమ్ము చేసుకోవడం ఈ రియల్ మాఫీయా దినచర్య.
ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఇస్కిల్లా,కక్కిరేణి, రంగమ్మగూడెం గ్రామాల మధ్య ఆవాసాలకు దూరంగా రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన పోతారం చెరువుపై అక్రమార్కుల చూపు పడింది.ఈ మూడు పల్లెల్లో రైతులకు, ప్రజలకు, పశుపక్ష్యాదులకు, మత్స్య కార్మికులకు జీవనాధారమైన చెరువుకు జీవం లేకుండా చేసే కుట్రకు తెరలేచింది.
చెరువు కట్టపై చెట్లను కొట్టి కబ్జా చేసి, ప్రోక్లైన్లతో మట్టిని త్రవ్వి అక్రమంగా అక్రమార్కుల పట్టా భూముల్లోకి తరలించారు.అంతటితో ఆగకుండా చెరువు ఎఫ్.టి.ఎల్ లోకి చొరబడి మట్టితో నింపి,రాళ్లతో పూడ్చివేస్తున్నారు.ఇప్పటికే దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఆరు నుంచి పది ఫీట్ల ఎత్తులో మట్టి రాళ్లను నింపేశారు.ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాలకు దూరంగా ఉండటంతో అక్రమార్కుల వికృత చేష్టలు ఎవరూ గమనించలేదు.
చెరువు దగ్గర ఏదో జరుగుతుందని తెలుసుకున్న రైతులు వెళ్లి చూడగా ఎఫ్.టి.ఎల్ పరిధిలో మట్టి పోయడం,చెరువుకట్టను జెసిబి,హిటాచిల ద్వారా చీల్చి కబ్జా చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.చెరువు కట్టపై పక్షులకు ఆవాసంగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను నరికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.
నెలల తరబడి ఈ కబ్జాల పర్వం కొనసాగుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం ఈ వంక తొంగి చూసిన పాపాన పోలేదంటే ఇదంతా అందరికీ తెలిసే జరుగుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి చెరువులో మట్టిని రాళ్లను తలోగించి,ఎఫ్.
టి.ఎల్ ను కాపాడి,చెరువును,చెరువు కట్టను కబ్జా చేసి,చెట్లను నరికి,చెరువులో మట్టిపోసిన వారిపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
.