యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జూన్ 1 నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలో పాల్గొనేందుకు అనుమతిస్తామని,కొండపై పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించిన విషయం తెలిసిందే.అయితే శనివారం నుండే ఆ నిబంధనలు అమలు జరగాల్సి ఉండగా ప్రస్తుతానికి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
ఆలయానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించడం,ప్లాస్టిక్ కు బదులు ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై అటు భక్తులకు,ఇటు వ్యాపారులకు మరింత అవగాహన కల్పించడం అవసరమని అధికారవర్గాలు భావిస్తున్నాయి.అందుకే దానిపై జూన్ 2న నేడు ఆలయ అధికారులు, ఉద్యోగులు,పోలీసులు, నాయీబ్రాహ్మణులతో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా కొండ పైన అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.