ఒక మనిషి తన జీవిత కాలంలో కోటి రూపాయలు సంపాదించాలంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే ఒక జంట మాత్రం తమ మొత్తం సంపాదన 200 కోట్ల రూపాయలను( 200 crore rupees ) దానం చేయడానికి సిద్ధమైంది.
గుజరాత్ లోని సంపన్న కుటుంబానికి చెందిన ఈ జంట అధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని నిర్ణయం తీసుకుని ఈ మొత్తాన్ని దానం చేసినట్టు సమాచారం అందుతోంది.ఇకపై ఈ దంపతులు జైన సన్యాసం స్వీకరించి సాధారణ జీవితం గడపనున్నారు.
హిమ్మత్ నగర్ కు చెందిన భవేశ్ దంపతులు( Bhavesh couple ) తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.సమాజంలో బోలెడంత పలుకుబడి, వ్యాపార సామ్రాజ్యం ఉన్నా అవి సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఈ జంట ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.
ఇప్పటికే భవేశ్ దంపతుల కొడుకు, కూతురు సన్యాసం స్వీకరించగా వీళ్లు కూడా అదే మార్గంలో నడవాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
భవేశ్ పూర్తి పేరు భవేశ్ బండారి కాగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా భవేశ్ ఊహించని స్థాయిలో సంపాదించాడు.అయితే కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి ఈ దంపతులను వెంటాడింది.రెండేళ్ల క్రితం కొడుకు, కూతురు సన్యాసం తీసుకోవడంతో వాళ్ల మార్గాన్నే అనుసరించాలని వీళ్లు భావించారు.
ఈ నెల 22వ తేదీన భవేశ్ దంపతులు అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు.
రెండు నెలల క్రితం జరిగిన ఒక వేడుకలో ఈ దంపతులు తమ ఆస్తిని విరాళంగా ప్రకటించడం జరిగింది.సన్యాసం తీసుకున్న తర్వాత తెల్లని దుస్తులను ధరించి ఒక గిన్నె తీసుకుని దేశమంతటా చెప్పులు లేకుండా ప్రయాణించనున్నారు.ఇకపై భిక్షతో మాత్రమే జీవనం సాగించనున్నారు.
అయితే ఈ దంపతులు తీసుకున్న నిర్ణయం విషయంలో కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.