ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ పోలీస్ ట్రెయినింగ్ సెంటర్ (సీటీసీ) ప్రిన్సిపాల్ గా జిల్లా అదనపు డీసీపీ (శాంతి భద్రతలు) ఏ.సుభాష్ చంద్రబోసు ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.
ఆ మేరకు మంగళవారం సిటిసి అదనపు డిసిపిగా నియామకం ఉత్తర్వులు వెలుపడ్డాయి.జిల్లా అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా జిల్లాలో 2021 ఏప్రిల్ 6న బాధ్యతలు చేపట్టిన సుభాష్ చంద్రబోస్ జిల్లాలో సమర్ధవంతమైన పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారు.
త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సుభాష్ చంద్రబోస్ ను పోలీసు ఉన్నతాధికారులు
వారం రోజుల క్రితం జరిగిన అదనపు ఎస్పీ క్యాడర్ పోలీసు అధికారుల బదిలీల్లో భాగంగా హైదరాబాద్ లోని తెలంగాణా రాష్ట్ర కంట్రోల్ సెంటర్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించే విషయంలో కొన్ని ఆప్షన్లు ఉండడం, స్థానికేతర జిల్లాలకు సంబంధించిన వారిని బదిలీ చేయాల్సి వస్తే ఎన్నికల ప్రధాన విధులకు సంబంధించిన బాధ్యతల్లో కాకుండా ఇతర లూప్ లైన్ బాధ్యతల్లో అధికారులను కొనసాగించవచ్చనే నిబంధనలు ఉన్న నేపధ్యంలో సుభాష్ చంద్రబోస్ ను ఖమ్మం జిల్లాకు తిరిగి బదిలీ చేసినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లాలో సిటీ ట్రెయినింగ్ సెంటర్ (పోలీసులకు శిక్షణ ఇచ్చే కేంద్రం)కు ప్రిన్సిపాల్ గా బదిలీ చేశారు.