టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు.రేపు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కాబోతుండడంతో, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు.ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఏర్పాటు అవుతున్న టిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ను రేపు ప్రారంభించబోతున్నారు.
దీనికోసం ఆయన నిన్ననే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.ఆయనకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామ నాగేశ్వరరావు, కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్ , రంజిత్ రెడ్డి, కె.ఆర్ సురేష్ రెడ్డి రాములు , బడుగుల లింగయ్య యాదవ్ స్వాగతం పలికారు.పార్టీ కార్యాలయంలో రాజశ్యామల, నవ చండీ యాగాలు కేసీఆర్ సతీసమేతంగా పాల్గొనబోతున్నారు.
అలాగే మంత్రి వేముల సంతోష్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ , వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ తో కలిసి మూడు రోజులుగా యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు.
హోమంలో పాల్గొనేందుకు శృంగేరి పీఠం నుంచి 12 మంది రానున్నారు.వీటిని శృంగేరి పీఠం గోపి శర్మ ఆధ్వర్యంలో యాగాలు జరగబోతున్నాయి.
యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇక వాస్తుకు అనుగుణంగా పార్టీ కార్యాలయం భవనంలో మార్పు చేర్పులు చేపడుతున్నారు.
మొత్తం నాలుగు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నట్టు సమాచారం.ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి.
ముఖ్యంగా ఢిల్లీలో ‘ కెసిఆర్ ఫర్ ఇండియా’ దేశ్ కి నేత, కిసాన్ కి భరోసా, ‘అబ్కి బార్ కిసాన్ సర్కార్‘ అనే నినాదాలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఇప్పటికే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లకు కెసిఆర్ ఆహ్వానాలు పంపించారు.
వీరితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ వేత్తలను , వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను కేసీఆర్ ఆహ్వానించారు.ముఖ్యంగా జెడిఎస్ అధ్యక్షుడు కుమారస్వామి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలా చాలామందిని ఆహ్వానించారు.