ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత వైసీపీ ప్లీనరీ సమావేశాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్లీనరీ సమావేశాలను నిర్వహించడం సాధ్యపడలేదు.
మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈ ఏడాది ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని వైసీపీ అధిష్టానం తలపెట్టింది.గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ జరుగుతోంది.
ఇప్పటికే తొలిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అయితే గత మూడేళ్ల పాలనపైనే ప్లీనరీలో వైసీపీ నేతలు ముఖ్యంగా చర్చించనున్నారనే సంగతి అర్ధమవుతోంది.
ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలనే ప్రచారం చేసుకుని మరోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.అప్పులు చేసి మరీ ప్రజలకు అప్పన్నంగా డబ్బులు పంచిబెడుతున్నామనే సంగతిని ఏకరువు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
సంక్షేమ పథకాలతోనే వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుచుకునేలా ప్రయత్నించాలని ఇప్పటికే వైసీపీ నేతలకు అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్లీనరీలో భవిష్యత్ ఎజెండా ఎలా ఉంటుందనే విషయం కూడా ఆసక్తి రేపుతోంది.
ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని గంభీరం వ్యక్తం చేస్తూనే దొంగచాటుగా బీజేపీకి వైసీపీ మద్దతిస్తున్న విషయాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు.అయితే బీజేపీకి మద్దతిస్తున్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హోదా విషయంలో వైసీపీ సైలెంట్‌గా ఉంటోంది.
మరి ప్లీనరీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి వీటికి సంబంధించి ఏవైనా హామీలు ఇస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో తాము ప్రజలకు ఏమీ చేయకుండానే 151 సీట్లు సాధించినప్పుడు ఇప్పుడు అప్పులు చేసి మరీ ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నందున పూర్తిస్తాయిలో సీట్లను ఎందుకు కైవసం చేసుకోలేమన్నది వైసీపీ అధినేత జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.
అటు ప్లీనరీ సమావేశాలకు 3 లక్షల మంది జనాభాను వైసీపీ తరలిస్తోంది.ఇందుకు అనుగుణంగా వంటకాలను సిద్ధం చేస్తోంది.ఫుడ్ వడ్డించేందుకు ఏకంగా 250 కౌంటర్లు ఏర్పాటు చేసింది.కాగా వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్లీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా హాజరయ్యారు.